* కూలీ, ఇతర చార్జీలకు డిజిటల్ విధానంలోనే చెల్లింపులు
ఆకేరు న్యూస్, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొలువైన కూటమి ప్రభుత్వం నిర్మాణదారులకు శుభవార్త తెలిపింది. ఉచిత ఇసుక పాలసీపై (Free sand policy) జీవో జారీ చేసింది. సోమవారం మధ్యాహ్నం విడుదల చేసింది. పాత ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. 2024 ఇసుక విధానం రూప కల్పన వరకూ సరఫరాకు మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త ఇసుక విధానాన్ని తెచ్చే వరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి వరకు వినియోగదారుడికి ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో నంబర్ 43ను జారీ చేసింది. వినియోగదారుడు ఎత్తుడు, దించుడు కూలీతో ఇతర చట్టబద్ధమైన పన్నులు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది. కూలీ, ఇతర చార్జీలకు డిజిటల్ విధానంలోనే చెల్లింపులకు అంగీకారం తెలిపింది. రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఇసుక సరఫరాపై మార్గదర్శకాల విడుదల చేసింది. ఇసుక తవ్వకాల నిమిత్తం జిల్లా కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. జిల్లా ఇసుక కమిటీల్లో జిల్లా ఎస్పీ, జేసీ సహా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ఉండనున్నారు. జిల్లాల్లోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలకు సర్కార్ సూచనలు చేసింది. ఇసుకను తిరిగి విక్రయించినా ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. భవన నిర్మాణ మినహా ఉచిత ఇసుకను మరే ఇతర అవసరాలకు వినియోగించొద్దని స్పష్టం చేసింది. ఇసుక అక్రమ రవాణా చేసినా, ఫిల్లింగ్ చేసినా పెనాల్టీలను నిర్ధారిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
——————————–