* డిజిటల్ పేమెంట్స్ లో భారత్ రికార్డు సృష్టిస్తోంది
* భారత అభివృద్ధిని చూసి ప్రపంచం నివ్వెరపోతోంది
* రష్యాలోని ప్రవాస భారతీయులతో సమావేశంలో ప్రధాని మోదీ
ఆకేరు న్యూస్ డెస్క్ : త్వరలో పేదలకు మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రకటించారు. రష్యా పర్యటనలో ఉన్న మోదీ మాస్కోలో ప్రవాస భారతీయులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 140 కోట్ల మంది భారతీయుల ప్రేమను తీసుకొచ్చానని, మాతృభూమి నుంచి ప్రవాస భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. మూడో సారి ప్రధానిగా బాధ్యతలు తీసుకుని నెల గడిచిందన్నారు. పదేళ్లలో బీజేపీ (BJP) ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
భారత అభివృద్ధిని చూసి ప్రపంచం నివ్వెరపోతోందని, పదేళ్లలో ఎయిర్పోర్టుల సంఖ్యను రెట్టింపు చేశామని వివరించారు. ఆదిత్య ఎల్1 పేరుతో భారత్ సూర్యుడిని చుట్టేస్తోందన్నారు. అందుకే భారత్ మారుతోందని అందరూ అంటున్నారని తెలిపారు. 40వేల కిలోమీటర్లకు పైనే రైల్వే లైనును ఆధునీకరించామన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహాన్ని, రైల్వే బ్రిడ్జిని భారత్ నిర్మించిందని వివరించారు. రైతులు, కార్మికులు కష్టపడి దేశాభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారని కొనియాడారు. జీ 20 సదస్సును విజయవంతంగా నిర్వహించామన్నారు. డిజిటల్ పేమెంట్స్ (Digital Payment) లో భారత్ రికార్డు సృష్టించిందని తెలిపారు.
—————————————————————–