HYDRAA Commissoner Ranganath on Gachibowli Illegal Constructions
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి, అంజయ్యనగర్ ప్రాంతంలో నిబంధనలు దాటి నిర్మించిన అక్రమ భవనాలపై చర్యలు తీవ్రతరం కానున్నాయి. అనుమతులు లేకుండా, డ్రైనేజీ/నాలాలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలన్నింటినీ నేలమట్టం చేస్తామని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) కమిషనర్ ఎ.వి. రంగనాథ్ స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల ప్రాణాలతో ఆడుకునే వారిని ఎంతమాత్రం సహించేది లేదని ఆయన తేల్చిచెప్పారు.
ప్రమాదం జరిగిన స్థలంలో సహాయక చర్యలను నేరుగా పర్యవేక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నీటి పారుదల కాలువల (నాలాలు) ఒడ్డునే భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఈ భవనాలు నిర్మించారని తెలిపారు. సదరు బిల్డర్ నిబంధనలకు విరుద్ధంగా ప్రధానంగా హాస్టల్ ప్రాంగణాలను నిర్మిస్తున్నాడని, అతని ఆధ్వర్యంలో జరిగిన నిర్మాణాలు నాణ్యత లేకుండా ప్రమాదకర రీతిలో ఉన్నట్లు అధికారుల దృష్టికి వచ్చిందన్నారు.
నిబంధనలు తుంగలో తొక్కి అక్రమంగా భవనాలు నిర్మించిన బిల్డర్‌పై కఠిన చట్టపరమైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని రంగనాథ్ వెల్లడించారు. నాలాల పరివాహక ప్రాంతాల్లో భవిష్యత్తులో ఇలాంటి ముప్పు రాకుండా అక్రమ కట్టడాలన్నింటిపై ప్రత్యేక ఆపరేషన్ చేపడతామని స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
