Station Ghanpur Natural Resources
* సహజ సంపదకు అక్రమార్కుల ఎసరు!
* కరిగిపోతున్నాయి గుట్టలు
* తరిగిపోతున్న వృక్ష సంపద
* చోద్యం చూస్తున్న అధికారులు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
మారుమూల గ్రామాల్లో వందల సంవత్సరాల నాటి సహజ సంపదల (కొండలు, గుట్టలు, చెట్లు)ను అక్రమార్కులు దోచుకుంటున్నారు. క్వారీల పేరుతో కొండలను, వెంచర్ల పేరుతో చెట్లను తొలగిస్తూ ప్రకృతి అందాలను కనుమరుగు చేస్తున్నారు. ఫలితంగా పశుపక్షాధులకు నిలువ నీడ లేకుండా పోగా వాటిపై ఆధారపడి జీవించే గొల్ల కురుమలకు జీవనాధారం కరువు అవుతుంది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం సముద్రాల గ్రామ గొల్ల కురుమలు ‘బోడ గుట్ట’ ఆక్రమణకు గురైనట్లు చేస్తున్న ఆరోపణ ఇందుకు నిదర్శనం.
* “బోడగుట్టపై చెట్ల తొలగింపు”
సర్వే నంబర్ 189, 212 లోని సుమారు 100 ఎకరాల్లో 30 ఎకరాల వరకు గుర్తుతెలియని అక్రమార్కులు చెట్లను తొలగించి చదును చేసే ప్రయత్నం చేస్తున్నారని గ్రామ గొల్ల కురుమల సంఘం ఆరోపించింది. పంచరాయిగా, ప్రభుత్వ భూమిగా వందల ఏళ్ల నుంచి చెప్పుకుంటున్న బోడగుట్ట ఆక్రమణకు గురైతే గొర్రెలు, మేకలు, పశుపక్షాదులకు నిలువ నీడ లేకుండా పోతుందని తమకు జీవనాధారం కరువైతుందని దాదాపు 50 మంది గొల్ల కురుమలు బోడ గుట్ట వద్ద నిరసన వ్యక్తం చేశారు.
* “ఆక్రమణకు గురవుతున్న గుట్టలు”
సముద్రాల గ్రామ శివారులో ఉన్న బోడ గుట్ట, దొంగల బోడు, ఏదుల బోడు, గడ్డి బోడు, మంతెన బోడు లు కూడా ఆక్రమణకు గురవుతున్నట్లు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
* “పట్టించుకోని అధికారులు”
మారుమూల గ్రామాల నుండి విలువైన అటవీ సంపద తరలిపోతున్న, సహజ సిద్దంగా వెలిసిన గుట్టలు, కొండలు కరిగిపోతున్న సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అటవీ, మైనింగ్ శాఖల అధికారులు ఉన్నప్పటికీ మామూళ్లకు అలవాటు పడి అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపిస్తున్నారు.
* “ చర్యలు తీసుకోవాలి”
సహజ సిద్ధంగా ఉన్న కొండలు, గుట్టలు ప్రభుత్వ భూముల్లో ఉన్న వనమూలికలు, పండ్ల చెట్ల తోపాటు విలువైన చెట్లను తరలిస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన గొల్ల కురుమ సంఘం నాయకులు కత్తుల రాజు, తాటికొండ కుమారస్వామి, తాటికొండ కొమురయ్య, బండి అశోక్, బండి రాజు, మేకల కొమురయ్య, తాటికొండ అశోక్, తాటికొండ నాగరాజు, కత్తుల పిచ్చయ్య, కన్నబోయిన అశోక్ తదితరులు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బోడగుట్టను కబళించేందుకు చెట్లను తొలగించిన అక్రమార్కులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని సముద్రాల యాదవ సంఘం సభ్యులు అధికారులను కోరారు

Please tell us what is wrong. Your report will be sent to the website team.
