Sarampalli Malla Reddy Death
* సాగునీటి రంగ నిపుణుడిగా గుర్తింపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు, సీపీఐ(ఎం) సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి (90) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. వయోభారంతో పాటు శ్వాసకోశ సమస్యలతో ఆయన కొద్ది రోజులుగా బాధపడుతున్నారు. సమస్య తీవ్రతరం కావడంతో ఆయన నాలుగు రోజులుగా హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆరోగ్యం మరింత విషమించడంతో వైద్యులు అత్యవసర చికిత్స అందించి ప్రాణాలు కాపాడు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పరిస్థితి పూర్తిగా విషమించడంతో ఫలితం లేకపోయింది. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.
* ఎంబీ భవన్కు పార్థివదేహం
రేపు ఉదయం ఎంబీ భవన్కు ఆయన పార్థివ దేహాన్ని తరలించనున్నట్లు కుటుంబ సభ్యులు, సీపీఎం నేతలు తెలిపారు. అక్కడ అభిమానుల సందర్శనార్థం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఉంచనున్నారు.
మల్లారెడ్డి స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట. ఆయన కొన్ని దశాబ్దాలుగా రైతు సమస్యలపై పోరాడుతున్నారు. అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడిగానూ ఆయన పనిచేశారు.
* రైతు సమస్యలపై పోరాటం
మొదటి నుంచీ కమ్యూనిజం భావాలు కలిగిన మల్లారెడ్డి సీపీఎంలో ప్రముఖ నేతగా ఎదిగారు. రైతు సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులపై ఆసక్తి, అవగాహన తో ఆ దిశగా అడుగులు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీపీఐ(ఎం) పార్టీలో అత్యున్నత స్థాయి బాధ్యతలు నిర్వర్తించారు. దశాబ్దాల పాటు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి కొరత, మద్దతు ధరల లేమి, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు వంటి అనేక అంశాలపై సుదీర్ఘ పోరాటాలు చేశారు. అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఢిల్లీ వేదికగా అనేక ఆందోళనల్లో కీలక పాత్ర పోషించారు.
* ప్రాజెక్టులపై పట్టు
రైతు సమస్యలపై పోరాటంలో భాగంగా ఆయన సాగునీటి ప్రాజెక్టులపై పట్టు సాధించారు. సాగునీటి రంగ నిపుణుడిగా గుర్తింపు పొందారు. ఉమ్మడి ఏపీలోని గోదావరి, కృష్ణా జలాల కేటాయింపులు, ప్రాజెక్టుల డిజైన్లు, ముంపు సమస్యలపై ఆయనకు విశేషమైన విశ్లేషణాత్మక అవగాహన ఉండేది. ప్రజాశక్తి జర్నలిజం విద్యార్థులకు కూడా ఆయా అంశాలపై పాఠాలు బోధించేవారు. నదీ జలాలు, వ్యవసాయ ఆర్థిక సంక్షోభం, రైతు ఆత్మహత్యలకు గల కారణాలపై ఆయన రాసిన పలు పుస్తకాలు, వ్యాసాలు రైతు ఉద్యమకారులకు ప్రేరణగా నిలుస్తున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
