Tamilnadu CM vijay, Parandur Airport Project
* విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఆకేరు న్యూస్, చెన్నై :
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంచీపురం జిల్లాలో ప్రతిపాదించిన పరందూర్ విమానాశ్రయ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి విజయ్ సోమవారం, ఆగస్టు 24న ప్రకటించారు.
చెన్నైకి రెండో విమానాశ్రయంగా పరందూర్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును నిర్మించాలని గతంలో ప్రతిపాదించారు. అయితే వ్యవసాయ భూములు కోల్పోతామని, గ్రామాల నుంచి ప్రజలను నిర్వాసితులను చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ రైతులు, స్థానిక గ్రామాల ప్రజలు సుదీర్ఘకాలంగా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు.
* హామి ఇచ్చాం- రద్దు చేశాం
అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాంచీపురం జిల్లాలోని 13 గ్రామాల రైతులకు అండగా నిలుస్తానని తాను ఇచ్చిన మాట ప్రకారం పరందూర్ విమానాశ్రయ ప్రాజెక్టును ప్రభుత్వం విరమించుకుంటున్నట్లు ప్రకటించారు.
అయితే చెన్నైకి రెండో విమానాశ్రయం అవసరాన్ని ప్రభుత్వం పక్కన పెట్టడం లేదు. కొత్త విమానాశ్రయానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తిస్తామని తెలిపింది. రైతులు, వ్యవసాయ భూములు, నివాస ప్రాంతాలపై సాధ్యమైనంత తక్కువ ప్రభావం పడే ప్రాంతాన్ని ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
* మీనంబాక్కం విమానాశ్రయం విస్తరణ
కొత్త విమానాశ్రయం నిర్మాణం పూర్తయ్యే వరకు పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు ప్రస్తుతం ఉన్న చెన్నై మీనంబాక్కం విమానాశ్రయాన్ని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సహకారంతో కొత్తగా టెర్మినల్-5ను అభివృద్ధి చేయనున్నారు. దీంతోపాటు విమానాశ్రయానికి కొత్త అప్రోచ్ రోడ్డు, ఫ్లైఓవర్‌ను నిర్మించనున్నారు. ఈ విస్తరణ ద్వారా ప్రస్తుత విమానాశ్రయ ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
* అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్
పరందూర్ ప్రాజెక్టును రద్దు చేయడంపై ప్రతిపక్ష డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి ప్రకటనపై అసెంబ్లీలో చర్చకు అవకాశం ఇవ్వాలని డీఎంకే ఎమ్మెల్యేలు కోరారు.
అయితే రూల్ 110 కింద ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై చర్చకు అవకాశం లేదని స్పీకర్ జె.సి.డి. ప్రభాకర్ స్పష్టం చేశారు. దీనికి నిరసనగా డీఎంకే సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
* తమిళనాడు అభివృద్ధికి ఎదురుదెబ్బ: స్టాలిన్
మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించారు. పరందూర్ ప్రాజెక్టును రద్దు చేయడం తమిళనాడు అభివృద్ధికి ఎదురుదెబ్బగా ఆయన అభివర్ణించారు.
ఇప్పటికే ప్రణాళికలో ఉన్న ప్రాజెక్టును వదిలేసి, మరో ప్రాంతంలో కొత్తగా స్థల ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తే రాష్ట్ర విమానయాన, మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికలు ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని స్టాలిన్ వాదించారు.
* ఏళ్లుగా వివాదంలో పరందూర్
పరందూర్ విమానాశ్రయ ప్రాజెక్టు కొన్నేళ్లుగా పరిశీలనలో ఉంది. భూములు కోల్పోయే రైతులు, నిర్వాసితులయ్యే గ్రామాల ప్రజలు చేపట్టిన సుదీర్ఘ ఆందోళనలతో ఇది తమిళనాడులో ప్రధాన రాజకీయ అంశంగా మారింది. విజయ్ గతంలోనే పరందూర్ ప్రాంత ప్రజల పోరాటానికి మద్దతు ప్రకటించారు.
ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పరందూర్ ప్రాజెక్టును రద్దు చేయడం ద్వారా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని విజయ్ ప్రభుత్వం అమలు చేసినట్లయింది. అయితే చెన్నైకి రెండో విమానాశ్రయం ఎక్కడ ఏర్పాటు చేస్తారు? కొత్త స్థలాన్ని గుర్తించడానికి ఎంత సమయం పడుతుంది? అప్పటివరకు మీనంబాక్కం విస్తరణ పెరుగుతున్న విమాన ప్రయాణికుల రద్దీని ఎంతవరకు తట్టుకోగలదు? అనే అంశాలు ఇప్పుడు కీలకంగా మారనున్నాయి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
