Karimnagar Mother Murder Case
* తల్లిని బావిలో వేసిన కన్న కొడుకులు
* ఐదు నెలల తర్వాత గుట్టు రట్టు
ఆకేరు న్యూస్, హుజురాబాద్ :
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నప్రేమను మూఢనమ్మకాలు మింగేశాయి. కష్టాల్లో ఉన్నప్పుడు ఆసరాగా నిలవాల్సిన కొడుకులే కాలయముళ్లలా మారి, వయోభారంతో ఉన్న తల్లిని దారుణంగా హత్య చేశారు. తల్లి ఇంట్లో చనిపోతే వాస్తుదోషం చుట్టుకుంటుందని, ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుందనే అంధవిశ్వాసంతో 80 ఏళ్ల వృద్ధురాలిని సజీవంగా బావిలోకి తోసేసిన అమానుష సంఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా నమ్మించేందుకు యత్నించిన నిందితుల కట్టుకథను ఐదు నెలల సుదీర్ఘ విచారణ తర్వాత పోలీసులు ఆధారాలతో సహా ఛేదించారు.
* పక్షవాతంతో మంచానికే పరిమితమైన తల్లి
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామానికి చెందిన నూనె వెంకటమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సమ్మయ్య, చిన్న కుమారుడు శ్రీనివాస్. వృద్ధాప్యంతో పాటు కొంతకాలంగా వెంకటమ్మ తీవ్ర పక్షవాతంతో బాధపడుతూ పూర్తిగా మంచానికే పరిమితమైంది. కొడుకులు ఇద్దరూ ఆమెను చూసుకోవడాన్ని భారంగా భావించడమే కాకుండా, రోజురోజుకూ క్షీణిస్తున్న ఆమె ఆరోగ్యాన్ని చూసి క్రూరమైన ఆలోచన చేశారు.
*అంధవిశ్వాసమే హత్యకు మూలం
తీవ్ర అనారోగ్యంతో ఉన్న తల్లి ఇంట్లోనే మరణిస్తే కుటుంబానికి పెద్ద వాస్తుదోషం చుట్టుముడుతుందని, అరిష్టం జరిగి ఉన్న ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుందని సమ్మయ్య, శ్రీనివాస్ భావించారు. ఈ మూఢనమ్మకంతో తల్లిని ఎలాగైనా వదిలించుకోవాలని దారుణమైన పథకం వేశారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన అర్ధరాత్రి సమయంలో, మంచంపై ఉన్న తల్లిని నిశ్శబ్దంగా సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లారు. కనీసం కేకలు కూడా వేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ కన్నతల్లిని ఏమాత్రం కనికరం లేకుండా లోతైన బావిలోకి తోసి చంపేశారు.
*ప్రమాదంగా చిత్రీకరించేందుకు కట్టుకథ
హత్య జరిగిన అనంతరం సమాజం నుంచి తప్పించుకునేందుకు నిందితులు ఒక పథకం ప్రకారం వ్యవహరించారు. తల్లికి కంటిచూపు మందగించిందని, మతిస్థిమితం కూడా సరిగా లేకపోవడంతో రాత్రి వేళ బయటకు వచ్చి ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిందని గ్రామంలో నమ్మబలికారు. అంతేకాకుండా సైదాపూర్ పోలీసు స్టేషన్లో కూడా ప్రమాదవశాత్తు జరిగిన మరణంగానే ఫిర్యాదు చేసి కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించారు.
* 5 నెలలుగా రహస్య నిఘా..
ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన సమయం నుంచి నిందితులైన ఇద్దరు కుమారుల కదలికలు, మాట్లాడే విధానంపై పోలీసులకు తీవ్ర అనుమానం కలిగి వారిపై దాదాపు ఐదు నెలల పాటు రహస్య నిఘా ఉంచారు. ఇటీవల పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో సుదీర్ఘంగా విచారించారు. పోలీసుల విచారణలో కొడుకులు చెప్పిన కట్టుకథల్లోని వైరుధ్యాలు బయటపడటంతో వారు చేసిన నేరాన్ని ఒప్పేసుకున్నారు. ఇంట్లో చనిపోతే వాస్తుదోషం వస్తుందనే మూఢనమ్మకంతోనే తల్లిని బావిలోకి తోసి చంపినట్లు విచారణలో ఇద్దరు కుమారులు స్పష్టం చేశారు.
* నిందితులకు రిమాండ్ విధిస్తూ కోర్టు సంచలన తీర్పు
ఈ క్రూరమైన ఘటనపై హుజూరాబాద్ రూరల్ సీఐ శ్రీనివాస్, సైదాపూర్ ఎస్సై స్వాతి కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, నిందితులపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఐదు నెలలుగా మిస్టరీగా మారిన ఈ దారుణ హత్య కేసును సమర్థవంతంగా ఛేదించిన ఏఎస్సైలు సంపత్ రెడ్డి, తిరుపతి, కానిస్టేబుల్ రాజు, హోంగార్డ్స్ రఫీ, తిరుపతిలను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.
—————-

Please tell us what is wrong. Your report will be sent to the website team.
