Avengers Endgame Encore re-release
* సెప్టెంబర్ 25న దేశవ్యాప్తంగా థియేటర్లలోకి..
* గతంలో రికార్డులు సృష్టించిన అవెంజర్స్: ఎండ్‌గేమ్
ఆకేరు న్యూస్, డెస్క్:
ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) ఎపిక్ మూవీ ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. మార్వెల్ ప్రేమికులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు మార్వెల్ స్టూడియోస్ ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ (Avengers Endgame: Encore) పేరిట ప్రత్యేక ప్రదర్శనను సెప్టెంబర్ 25న భారతదేశంలోని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
* పలు భాషల్లో అలరించనున్న సినిమా
ఈ చిత్రం ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో భారతీయ ప్రేక్షకులను అలరించనుంది. కేవలం సాధారణ స్క్రీన్స్ మాత్రమే కాకుండా, ప్రేక్షకులకు దృశ్యకావ్యంగా అనిపించేలా ఐమాక్స్ (IMAX), మార్వెల్ స్టూడియోస్ సర్టిఫై చేసిన ‘ఇన్ఫినిటీ విజన్’ (INFINITY VISION) ప్రీమియం లార్జ్ ఫార్మాట్ స్క్రీన్లలో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. బిగ్గర్ స్క్రీన్స్, ప్రకాశవంతమైన 4K/HDR న్యూ కలర్ గ్రేడింగ్ విజువల్స్, థండరస్ డాల్బీ సౌండ్‌తో థియేట్రికల్ ఫీల్ రెట్టింపు కానుంది.
* 4 నిమిషాల అదనపు ఫుటేజ్.. నయా కనెక్షన్..
ఈ రీ-రిలీజ్లో మరో ప్రత్యేకత ఏమిటంటే, ఒరిజినల్ వెర్షన్ కంటే 4 నిమిషాలు అదనంగా ఉండే ఫుటేజ్‌తో దాదాపు 185 నిమిషాల (3 గంటల 5 నిమిషాలు) సుదీర్ఘ రన్టైమ్తో రానుంది. ప్రధానంగా థానోస్ సృష్టించిన విధ్వంసానికి సగం ప్రపంచ జనాభా కనుమరుగైన తర్వాత, మిగిలిన సూపర్‌హీరోలు తమ ప్రియమైన వారి కోసం చేసే పోరాటం, టైమ్ ట్రావెల్, తుది సమరం ప్రధానాంశంగా సాగుతుంది.
త్వరలో రాబోతున్న ‘అవెంజర్స్… డూమ్స్‌డే’ (Avengers: Doomsday) చిత్రానికి సంబంధించిన కీలకమైన ఎక్స్‌క్లూజివ్ క్లిప్, న్యూ పోస్ట్-క్రెడిట్ సీన్ కూడా ఈ ఎంకోర్ ఎడిషన్‌లో పొందుపరిచారు.
* అగ్రశ్రేణి సాంకేతిక బృందం..
కెవిన్ ఫైజీ నిర్మాణంలో రూపొందిన ఈ బ్లాక్‌బస్టర్‌కు ఆంథనీ రూసో, జో రూసో (రూసో బ్రదర్స్) అద్భుత దర్శకత్వం వహించారు. లూయిస్ డి’ఎస్పొసిటో, విక్టోరియా అలోన్సో, మైఖేల్ గ్రిల్లో, ట్రిన్ ట్రాన్, జాన్ ఫావ్రూ, జేమ్స్ గన్ మరియు దివంగత లెజెండ్ స్టాన్ లీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. మార్వెల్ సినిమా ప్రపంచంలో సరికొత్త శకానికి నాంది పలికిన ఈ విజువల్ వండర్‌ను మళ్లీ వెండితెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
