Mahabubabad farmer suicide
* అనుమానాస్పదస్థితిలో రైతు ఆత్మహత్య
* మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో ఘటన
ఆకేరు న్యూస్, మహబూబాబాద్:
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మండల పరిధిలోని నేరడ గ్రామానికి చెందిన మొగిలి చెర్ల రామచంద్రయ్య (65) అనే రైతు తన పొలంలో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రామచంద్రయ్య బుధవారం నేరడ శివారులోని తన పొలానికి వెళ్లాడు. అక్కడ ఓ చెట్టుకు ఉరివేసుకున్నాడు. గమనించిన గ్రామస్థులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు.
* బాట వివాదమే కారణమా ?
పొలం దారి (బాట) విషయమై కొంతకాలంగా రామచంద్రయ్యకు, మరో రైతుకు మధ్య పంచాయితీ (వివాదం) నడుస్తోందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మనస్తాపంతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం కష్టపడి వ్యవసాయం చేసుకునే రామచంద్రయ్య ఆత్మహత్యతో నేరడలో విషాదఛాయలు అలుముకుంది.
* రంగంలోకి దిగిన పోలీసులు..
సమాచారం అందుకున్న కురవి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బాట వివాదం కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
