CP Swetha, Drug-free society Jangaon
* మాదకద్రవ్యాల నిర్మూలనలో మహిళలు భాగస్వామి కావాలి
* యువత భవిష్యత్‌ను కాపాడాలి
– వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత
* మాదకద్రవ్యాల వాడకంతో కుటుంబాలు చిన్నాభిన్నం
– జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ఆకేరు న్యూస్, జనగామ :
మాదకద్రవ్యాల నిర్మూలనలో మహిళా సంఘాల పాత్ర కీలకమని, ప్రతి మహిళ తన కుటుంబంతో పాటు గ్రామాలు, పట్టణాలు మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడే “సంఘమిత్ర”గా వ్యవహరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు సంఘమిత్ర – మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజ మహేంద్ర నాయక్ తో కలిసి సీపీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధిలో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషించాయయన్నారు. గర్భిణీలకు పోషకాహారం అందించడం నుంచి చిన్నారులకు మధ్యాహ్న భోజనం, అక్షరాస్యత, కుటుంబ సంక్షేమం, సామాజిక ఆడిట్ వంటి అనేక కార్యక్రమాల్లో మహిళలు ముందుండి పని చేస్తున్నారన్నారు.
జనగామ జిల్లాలో మహిళల చైతన్యం ప్రత్యేకమని పేర్కొంటూ, ఆ చైతన్యాన్ని సమాజ భద్రత కోసం వినియోగించాలని కోరారు. పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో డ్రగ్స్ వ్యసనం అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిన విషయాన్ని ప్రస్తావిస్తూ, తెలంగాణలో అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త వహించాలన్నారు.
యువతే రాష్ట్ర భవిష్యత్ నిర్ణేతలన్నారు. మాదకద్రవ్యాల ప్రభావం మెదడు, నరాల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. డ్రగ్స్‌కు బానిసైన వారికి చికిత్స అందించి, తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావాలన్నారు. మహిళా సంఘాలు సామాజిక మార్పుకు బలమైన వేదికలుగా ఉన్నాయని, పోలీస్ శాఖలో ఉన్న పరిమిత సిబ్బందితో పోలిస్తే మహిళా సంఘాల ద్వారా లక్షలాది మందికి అవగాహన కల్పించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఎవరైనా మాదకద్రవ్యాలకు బానిసైనట్లు తెలిసినా, గంజాయి విక్రయాలు, రవాణా జరుగుతున్నట్లు సమాచారం ఉన్నా వెంటనే 112కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు అవసరమైతే బహుమతులూ అందజేస్తామని వెల్లడించారు. పాఠశాల నిర్వహణ కమిటీల్లోని మహిళా సభ్యులు విద్యార్థుల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పదో తరగతి (లేదా) ఇతర తరగతుల విద్యార్థులు అకస్మాత్తుగా పాఠశాలకు రాకపోవడం, తల్లిదండ్రుల మాట వినకపోవడం, అనుమానాస్పదంగా ప్రవర్తించడం వంటి అంశాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సంఘమిత్ర ఒకరోజు కార్యక్రమంతో ముగిసేది కాదని, ఇకపై మండల, జిల్లా సమాఖ్యల సమావేశాల్లో పోలీసు అధికారులు క్రమంగా పాల్గొని, డ్రగ్స్ నిర్మూలన, సైబర్ నేరాల నివారణ, మహిళల భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు.
అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిర్మూలనకు మహిళా సంఘాలే ప్రధాన శక్తిగా నిలవాలన్నారు. జిల్లాలో సుమారు 1.25 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు ఉన్నారని, వీరి ద్వారా ప్రతి ఇంటికి డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని తీసుకెళ్లవచ్చని చెప్పారు. డ్రగ్స్ వల్ల వ్యక్తిగత ఆరోగ్యం మాత్రమే కాకుండా కుటుంబాల్లో గృహ హింస, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
అలాగే, డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ.. జనగామ జిల్లా మహిళా సంఘాలు రాష్ట్రంలోనే అత్యంత చైతన్యవంతమైన సంఘాలుగా గుర్తింపు పొందాయన్నారు. డ్రగ్స్ మొదట సరదాగా ప్రారంభమై ప్రాణాంతక వ్యసనంగా మారుతుందని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనలో మార్పులు, ఆలస్యంగా ఇంటికి రావడం, రాత్రిళ్లు మేల్కొని ఉండడం, కొత్త స్నేహాలు, చేతులపై ఇంజెక్షన్ గుర్తులు, పెదాలు నల్లబడటం వంటి లక్షణాలను గమనించాలని సూచించారు. సమస్యను దాచిపెట్టకుండా వెంటనే పోలీసులకు (లేదా) డీ-అడిక్షన్ కేంద్రాలకు సమాచారం ఇవ్వాలని కోరారు. మాదకద్రవ్యాల నియంత్రణకు అమలులో ఉన్న ఎన్డీపీఎస్ చట్టం–1985 ప్రకారం గంజాయి సేవించడం, విక్రయించడం, రవాణా చేయడం, దాచిపెట్టడం వంటి నేరాలకు కఠిన జైలు శిక్షలు, భారీ జరిమానాలు ఉంటాయని వివరించారు. డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుంటే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సదస్సులో సైకాలజిస్ట్ డా. విజయక్రాంతి మాదకద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక దుష్ప్రభావాలు, చికిత్స, పునరావాసంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. అలాగే డ్రగ్స్ వ్యసనం వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులు, పోలీస్ జాగృతి కళా బృందం సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికల రూపంలో హృద్యంగా ప్రదర్శించి సందేశాన్ని అందించారు. అనంతరం మాదకద్రవ్యాల నిర్మూలనపై వారందరూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణ ప్రతిజ్ఞ చేశారు.
కార్యక్రమంలో ఏసీపీలు భీం శర్మ, నర్సయ్య, ఏపీడీ నూరుద్దీన్, ఇన్స్ స్పెక్టర్లు సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వేణు, జానకీరాం రెడ్డి సతీష్, చాకలి ఐలమ్మ సమాఖ్య నాయకురాలు మమత, ఇతర పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు, సభ్యులు, మహిళలు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
