Nepal Floods Death Toll
* వరద బీభత్సంతో అతలాకుతలం
* 165కు చేరిన మృతుల సంఖ్య
* ప్రభుత్వం భారీ స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్
* బాధితుల కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు
అకేరు న్యూస్, నేపాల్ :
నేపాల్‌ను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చింది. వాటి ధాటికి ఇప్పటివరకు కనీసం 165 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది ఆచూకీ తెలియకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాసువా సహా పలు ప్రాంతాల్లో వరదలు, కొండ చరియలు విరిగిపడడంతో గ్రామాలు, రహదారులు, వంతెనలు, విద్యుత్ మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా భారీగా నీరు, బురద, రాళ్లు కొట్టుకు రావడంతో ప్రజలకు తేరుకునే అవకాశం కూడా లేకుండా పోయింది.
* వందలాది మంది గల్లంతు
నేపాల్‌లో 800 మందికి పైగా గల్లంతైనట్లు తాజా అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. వీరిలో విదేశీ పర్యాటకులు, యాత్రికులూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. దాదాపు 500 మంది విదేశీయుల ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా తదితర దేశాలకు చెందిన పర్యాటకులు గల్లంతైన వారిలో ఉన్నారు.
* భారతీయుల ఆచూకీపై ఆందోళన
వరదల నేపథ్యంలో భారతీయుల భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొంది. తాజా లెక్కల ప్రకారం నేపాల్‌లో గల్లంతైన వారిలో 177 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. వీరిలో కొందరు కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన యాత్రికులు ఉన్నారు. అయితే భారతీయుల గల్లంతుపై వివిధ సమయాల్లో భిన్న సంఖ్యలు వెల్లడవుతున్నందున, రెస్క్యూ బృందాల గాలింపు కొనసాగుతున్న కొద్దీ స్పష్టమైన లెక్కలు వెలువడే అవకాశం ఉంది.
* గాలింపు ముమ్మరం
గల్లంతైన వారి కోసం నేపాల్ ప్రభుత్వం భారీ స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. హెలికాప్టర్ల ద్వారా వరద ప్రభావిత ప్రాంతాల్లో గాలింపు చేపట్టడంతో పాటు, ఆహారం, మందులు, ఇతర అత్యవసర సామగ్రిని బాధితులకు చేర వేస్తున్నారు. 5,000 మందికి పైగా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు సమాచారం.
* ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ప్రధాని
నేపాల్ ప్రధాని బాలేంద్ర షా స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తూ సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు. గల్లంతైన వారిని గుర్తించడం, చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, బాధితులకు తక్షణ సహాయం అందించడం తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యం అని ప్రభుత్వం వెల్లడించింది.
* గ్లేసియర్ కుప్పకూలడమే కారణం
తొలుత ఈ విపత్తుకు భూకంపమే కారణమని అనుమానాలు వ్యక్తమైనా, అమెరికా జియోలాజికల్ సర్వే తదుపరి విశ్లేషణలో ఇది భూకంపం కాదని తేల్చింది. హిమాలయ ప్రాంతంలో మంచు, రాళ్ల భారీ భాగం కుప్పకూలడంతో ఏర్పడిన డెబ్రిస్ ఫ్లోనే ఆకస్మిక వరదలకు కారణమైందని వెల్లడైంది. ప్రస్తుతం నేపాల్ ప్రభుత్వం, భద్రతా బలగాలు, రెస్క్యూ సిబ్బంది గల్లంతైన వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. మరోవైపు తమ కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. హిమాలయ ప్రాంతంలో కొనసాగుతున్న ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో భారతీయుల కోసం కేంద్రం ప్రభుత్వం అమ్రమత్తమైంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
