CM Revanth Reddy inspected Meer Alam Tank
* క్రేన్ ఎక్కి సస్పెన్షన్ బ్రిడ్జ్ పరిశీలన
* వరల్డ్ క్లాస్ టూరిజం హబ్‌గా మీరాలం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: చారిత్రక హైదరాబాద్ నగరంలోని మీరాలం ట్యాంక్‌ను ప్రపంచస్థాయి పర్యాటక క్షేత్రంగా రూపుదిద్దే బృహత్తర ప్రణాళికలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
క్షేత్రస్థాయికి చేరుకున్న సీఎం… అక్కడ శరవేగంగా కొనసాగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
* ప్రత్యేక క్రేన్ పైకి వెళ్లి సస్పెన్షన్ బ్రిడ్జ్ పరిశీలన
పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుగా ఓపెన్-టాప్ జీపులో ప్రయాణించి మీరాలం ట్యాంక్ చుట్టూ జరుగుతున్న పనులను ఆద్యంతం వీక్షించారు. అనంతరం మీరాలం చెరువుపై ప్రత్యేక ఆకర్షణగా నిర్మిస్తున్న భారీ సస్పెన్షన్ బ్రిడ్జ్ పనుల పురోగతిని తెలుసుకునేందుకు ఏకంగా భారీ క్రేన్ సహాయంతో పైకి వెళ్లి నిర్మాణ నమూనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను వీక్షించి, ప్రాజెక్టు డిజైన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
* పర్యటనలోని ప్రధాన మార్గదర్శకాలు..
కాలుష్య నివారణ & నాలాల విస్తరణ
చెరువులోకి ఎలాంటి మురుగు నీరు చేరకుండా పటిష్టమైన ఎస్టీపీ (STP) వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్షాకాలంలో ముంపు సమస్య తలెత్తకుండా మీరాలం చెరువు నుంచి మూసీ నదిలోకి వరద నీరు ఉధృతంగా వెళ్లేందుకు వీలుగా ప్రధాన నాలాను తక్షణమే విస్తరించాలని చెప్పారు.
* వాటర్ స్పోర్ట్స్ & ఐలాండ్ బ్యూటిఫికేషన్..
పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా చెరువులో సాహసపేతమైన వాటర్ స్పోర్ట్స్ (Water Sports) ఈవెంట్లను డిజైన్ చేయాలన్నారు. చెరువు మధ్యలో ఉన్న ఐలాండ్లను ప్రకృతి సిద్ధమైన అందాలతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు.
* ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అడ్వాంటేజ్..
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ ప్రాంతం అత్యంత సమీపంలో ఉన్నందున, విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షించే విధంగా మౌలిక వసతులు, ల్యాండ్‌స్కేపింగ్ ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు.
* నిర్దేశిత గడువు..
ప్రాజెక్టు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూనే, నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం గట్టిగా ఆదేశించారు.
ఈ ఆకస్మిక పర్యటనలో మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (MRDCL) ఉన్నతాధికారులు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) అధికారులు, మున్సిపల్ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం ఆదేశాల మేరకు త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
