Jute Bag Business Success Story
* జ్యూట్ బ్యాగుల తయారీ వ్యాపారంలో రాణిస్తున్న దంపతులు
* పలువురికి ఉపాధి కల్పిస్తున్న భార్యాభర్తలు
* ఆదర్శంగా నిలుస్తున్న జంట
ఆకేరు న్యూస్, హనుమకొండ :
కృషి, పట్టుదల, ఏదైనా సాధించాలన్న మనో సంకల్పం…ఈ మూడు లక్షణాలు మనలో బలంగా నాటుకుంటే చాలు.. మనం అనుకున్నది ఏదైనా సాధించవచ్చని నిరూపించారు ఖమ్మం జిల్లాకు చెందిన రమేశ్ దంపతులు. భార్యాభర్తలిద్దరూ ఉన్నత చదువులు చదివినా..టీచర్ ఉద్యోగాలను కాదని స్వయం ఉపాధినే నమ్ముకున్నారు. స్వయం కృషి, పట్టుదలతో జీవితంలో పైకి ఎదగాలన్న వారి ఆలోచనలే వారిని వ్యాపారవేత్తలుగా మార్చాయి. తన సతీమణి సహకారంతో అందమైన, రంగు రంగుల జ్యూట్ బ్యాగులను తయారు చేయడమే కాదు.. ఓ పది మందికి ఉపాధి కూడా కల్పిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు రమేశ్ దంపతులు. వారు తయారు చేసిన అందమైన, క్యూట్ జ్యూట్ బ్యాగులు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తూ తన ప్రతిభను ప్రపంచ నలుమూలలా చాటుతున్నారు. సందర్భం ఏదైనా..ఈవెంట్ ఏదైనా…ఇన్ని జ్యూట్ బ్యాగులు కావాలని ఆర్డర్ ఇస్తే చాలు…వెంటనే వాటిని తయారు చేసి అందిస్తారు.
* జ్యూట్ బ్యాగ్ తయారీ ఆలోచన ఎలా వచ్చింది?
ఖమ్మం జిల్లాకు చెందిన కె. రమేశ్..ఎమ్మెస్సీ ఫిజిక్స్, బీఈడీ చదివారు. తన సతీమణి ఉషారాణి కూడా ఎంఏ, బీఈడీ చదివారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పార్ట్ టైమ్ పని చేసినా, సొంతంగా భవితశ్రీ అకాడమి అనే ఇనిస్టిట్యూట్ పెట్టి ముగ్గురికి ఉపాధి కూడా ఇచ్చారు. అయితే ఎక్కడా ఉద్యోగిగా చేయకూడదనే ఉద్దేశంతోనే ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. దానికి తోడు తన కుటుంబ సభ్యులు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుండడం తన ఆలోచనలకు కలిసొచ్చింది. పర్యావరణానికి హానికలగకుండా జనపనార, కాటన్‌తో జ్యూట్ బ్యాగులను తయారు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. అలా తమ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే ఈ జ్యూట్ బ్యాగుల తయారీ బిజినెస్. 2017లో తన స్వగ్రామం చింతగట్టులో 4 లక్షల రూపాయల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించానని తెలిపారు. అలా తన సొంత గ్రామంలో మొదలైన ఈ వ్యాపారం ప్రస్తుతం బాగానే నడుస్తుందని.. కొన్ని ఒడిదొడుకులు ఎదురైనా.. తన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని చెబున్నాడు.
* చింతగట్టు టు హన్మకొండ
ఖమ్మం జిల్లాలో తన సొంత గ్రామం చింతగట్టులో వ్యాపారాన్ని ప్రారంభించినా తాను ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగకపోవడం, గ్రామంలో వర్కర్ల కొరత ఉండడం వల్ల, ఇటీవల హన్మకొండలోని రామారం ఎస్వీఎస్ కాలేజ్ జంక్షన్ దగ్గరకు మార్చారు. సిటీలో ఉండటం వల్ల వర్కర్లు దొరకడం, అడ్వర్టైజ్మెంట్ సులువైందని రమేశ్ చెప్తున్నారు.
* ఎన్ని రకాల బ్యాగులను తయారు చేస్తారు ?
సమాజం, పర్యావరణానికి ఉపయోగపడేలా ప్లాస్టిక్ రహితంగా కేవలం జనపనార, కాటన్ ఉపయోగించి మాత్రమే ఇక్కడ బ్యాగులు తయారు చేస్తారు. వీరి దగ్గర సుమారు 100 నుంచి 150 రకాల బ్యాగులు అందుబాటులో ఉంటాయి. ఇలా రకరకాలుగా తయారు చేసిన బ్యాగులను బర్త్ డే పార్టీలు, శుభకార్యాలు, సెమినార్లు, లాప్టాప్ బ్యాగులు, కామన్ స్క్వేర్ బ్యాగులు, సారీ సెంటర్లు, కిరాణా షాపుల కోసం కాటన్ బ్యాగులు, ఆస్పత్రుల్లో వాడే ఫైల్ ఫోల్డర్లు, బ్యాగులు, క్లాత్‌పై ప్రింట్ చేసే జ్యూట్ వెడ్డింగ్ కార్డ్స్ ఇలా రకరకాల బ్యాగులను తయారు చేస్తున్నారు. ఒక్కో బ్యాగు ధర రూ. 12 నుంచి మొదలుకొని రూ.120 వరకు ఉంటుంది. ఇలా తయారైన బ్యాగులను మున్సిపాలిటీలు, కలెక్టర్ కార్యాలయాలు, యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు, డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో జరిగే సెమినార్లకు సరఫరా చేస్తున్నారు. అయితే కనీసం 50 బ్యాగుల నుంచి 5 వేల బ్యాగుల వరకు ఆర్డర్ వచ్చినా వెంటనే తయారు చేసి ఇస్తామని రమేశ్ దంపతులు చెబుతున్నరు.
* వ్యాపారంలో ఎదుర్కొంటున్న సమస్యలు
వ్యాపారంలో అప్పుడప్పుడు వర్కర్ల కొరత వేధిస్తుందని రమేశ్ వివరించారు. నార్మల్ వర్కర్లు లాప్టాప్ వంటి క్లిష్టమైన బ్యాగులను కుట్టలేరని.. నైపుణ్యం గల పనివాళ్లు కావాలి.. కానీ వారు దొరకడం కష్టంగా ఉందంటున్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా.. తన జీవిత భాగస్వామి సహకారంతో ప్రస్తుతం బిజినెస్ బాగానే నడుస్తుందని చెప్తున్నారు. అయితే తనలాంటి వారికి ప్రభుత్వం ఆర్థికంగా సహకరిస్తే మరింత ఉత్సాహంతో పని చేస్తామన్నారు. ఇంకా అనేక మందికి శిక్షణ ఇచ్చి ఉపాధిని కూడా కల్పిస్తామని హామీ చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
