Nikhita Godishala Murder Case
* ఆగ్రాలో మాజీ ప్రియుడు అరెస్ట్
అకేరు న్యూస్ : అమెరికాలో తెలుగు యువతి నిఖిత గొడిశాల హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎనిమిది నెలలుగా పరారీలో ఉన్న కేసు నిందితుడు అర్జున్ శర్మను తెలంగాణ పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో అరెస్ట్ చేశారు. ఆగస్టు 24న అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అనంతరం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు.
మేరీల్యాండ్‌లోని కొలంబియాలో 2025 డిసెంబర్ 31న నిఖిత మృతి చెందినట్లు అమెరికా అధికారులు గుర్తించారు.
ఆమె మృతదేహాన్ని అర్జున్ శర్మకు చెందిన అపార్ట్మెంట్లో కత్తిపోట్లతో గుర్తించారు. నిఖిత అదృశ్యమైనట్లు అర్జున్నే పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత భారత్‌కు వచ్చేయడంతో అతడిపై అనుమానాలు బలపడ్డాయి. అమెరికా అధికారులు అతడిపై ఫస్ట్, సెకండ్ డిగ్రీ మర్డర్ అభియోగాలు నమోదు చేసి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
అర్జున్ శర్మపై హైదరాబాద్‌లోని లాలాగూడ పోలీస్ స్టేషన్లోనూ చీటింగ్ కేసు నమోదైంది. ఆ కేసు దర్యాప్తులో లభించిన ఆధారాలతో అతడి ఆచూకీని ఆగ్రాలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న అర్జున్ను తెలంగాణ పోలీసుల బృందం ఆగ్రా పోలీసుల సహకారంతో అరెస్ట్ చేసింది.
అరెస్టు అనంతరం ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో తదుపరి న్యాయ ప్రక్రియ కొనసాగింది. అమెరికా నుంచి వచ్చిన అప్పగింత అభ్యర్థన నేపథ్యంలో భారత్–అమెరికా మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ప్రక్రియ ప్రకారం అర్జున్ను అమెరికాకు అప్పగించే చర్యలు ప్రారంభమయ్యాయి.
దాదాపు ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న నిఖిత హత్య కేసులో అర్జున్ అరెస్ట్ కీలక మలుపుగా మారింది. ఇక అతడిని అమెరికాకు అప్పగించే ప్రక్రియ పూర్తయితే.. మేరీల్యాండ్‌లో నమోదైన హత్య కేసులో అక్కడి కోర్టులో విచారణ ఎదుర్కొనే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
