SIR Voter List
* ఓట్ల తొలగింపుతో నాయకులు హైరానా
* తొలగింపు జాబితాలో 73.39 లక్షల దరఖాస్తులు
* అభ్యంతరాలకు గడువు పెంచాలని సీఎం లేఖ
* సమీపంలో జీహెచ్ ఎంసీ ఎన్నికలు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ: ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రక్రియలో 73.39 లక్షల ఎంట్రీలు తొలగింపు జాబితాలో ఉండడం కలకలం రేపుతోంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పందించారు. అభ్యంతరాల స్వీకరణకు గడువును పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దీంతో సర్ పై మరింత ఉత్కంఠ ఏర్పడింది. రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే.. సర్ ప్రక్రియ స్థానికంగా కూడా ఆయా ప్రాంత రాజకీయాలపై ప్రభావం చూపుతోంది. భారీగా ఓట్ల తొలగింపు స్థానిక ఎన్నికల్లో ఎవరి కొంప ముంచుతుందో అన్న ఆందోళన నేతల్లో వ్యక్తం అవుతోంది.
* 59 శాతం కోర్ పరిధిలోనే..
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మాజీ కార్పొరేటర్లు, సీట్లు ఆశిస్తున్న కొందరు నాయకులు ఓట్ల కోసం ఎప్పటి నుంచో కసరత్తు ప్రారంభించారు. స్థానికంగా అందరికీ అందుబాటులో ఉంటూ పనులు చేసి పెడుతున్నారు. అలాగే కొన్ని ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి పెట్టి సొంత వనరులతో పనులు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఓట్ల తొలగింపు ఇప్పుడు వారిని గందరగోళంలో పడేసింది. ఏఎస్డీడీ కేటగిరీలో రాష్ట్ర వ్యాప్తంగా 73.39 లక్షల ఓట్లు ఉంటే వాటిలో 59 శాతం కోర్ పరిధిలోనివే ఉన్నాయి. త్వరలో ట్రై కార్పొరేషన్ల ఎన్నికల నేపథ్యంలో ఓట్ల తొలగింపు.. ఎవరిపై ప్రభావం చూపుతుందో అన్న ఆందోళన నేతల్లో వ్యక్తమవుతోంది.
* లక్ష్యం తలకిందులు..
ఎన్నికలు ఏమైనా ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆయా పార్టీల నేతలు బస్తీలు, కాలనీలపై ఎక్కువగా దృష్టి పెడతారు. అక్కడి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆసక్తి చూపుతారు. స్థానికంగా వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతారు. సంక్షేమ పథకాలు ఇక్కడి అర్హులకు అందేలా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఇప్పుడా ఏరియాలో ఓట్ల సంఖ్య తగ్గుతుండడంతో తాము చేసిన పనులు బూడిదలో పోసిన పన్నీరులా మారనున్నాయన్న అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు.
* కొందరి పరిస్థితి ఇలా..
మరి కొన్ని నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లోని డివిజన్ స్థాయి నేతలు ఇప్పటి నుంచే ఓట్ల లెక్కలు వేసుకుంటున్నారు.
* శేరిలింగపల్లి నియోజకవర్గంలో ఓ మాజీ కార్పొరేటర్ తన డివిజన్ పరిధిలోని పలు బస్తీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పైపులైన్ల నిర్మాణం, వీధిదీపాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో ఆయనకు స్థానికంగా పట్టు పెరిగింది. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు తనకే పడుతాయని ధీమాగా ఉన్నాడు. కీలక బస్తీల్లో ఎక్కువ ఓట్లు తొలిగించే అవకాశం ఉండడంతో ఆందోళనలో చెందుతున్నాడు.
* కుత్బుల్లాపూర్ ఓ డివిజన్లో మాజీ కార్పొరేటర్ బస్తీల్లో ఉండే అర్హులకు పింఛన్లు, గృహ జ్యోతి, ఉచిత నీటి సరఫరా వంటివి అందేలా చర్యలు తీసుకున్నారు.
* ఉప్పల్ సికింద్రాబాద్లో ఓ మాజీ కార్పొరేటర్ తనకు అండగా ఉండే బస్తీల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో భారీగా ఓట్లు తొలగించే అవకాశం ఉండడంతో ఆందోళన చెందుతున్నారు.
* ఓట్లు భారీగా తొలగించే చాన్స్
గ్రేటర్ హైదరాబాద్కు తెలంగాణలోని జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి నిమిత్తం వేలాది మంది వస్తుంటారు. వారిలో చాలా మంది సొంత గ్రామాలతో పాటు ఇక్కడా ఓటర్గా పేరు నమోదు చేసుకున్నారు. ఎస్ఐఆర్ నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడో ఒక చోట మాత్రమే ఓటర్గా కొనసాగాల్సిన పరిస్థితి. దీంతో చాలా మంది ఊర్లలోనే ఓటు హక్కు నమోదుకు ఆసక్తి చూపారు. ఈ క్రమంలో వారి పేర్లు ఇక్కడ తొలగించనున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో చాలా మంది బస్తీలు, దిగువ మధ్య తరగతి వర్గాలుండే కాలనీల్లో ఉంటారు. ఇప్పుడా ఏరియాల్లో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గనుంది.
* ఇప్పటి నుంచే దిద్దుబాటు చర్యలు
ఎస్ఐఆర్ లెక్కల ప్రకారం నేతలు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బలం పెంచుకునేందుకు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. గ్రేటర్లోని డివిజన్ల వారీగా నేతలు అందరూ అదే బాటలో ఉన్నారు. అనుచరులను పురమాయించి.. ఏ పోలింగ్ కేంద్రంలో ఎంత మంది పేర్లు తొలగించే అవకాశముంది? వారి పేర్లు, ఇతర వివరాలు సేకరిస్తున్నారు. దీంతో తన బలాబలాలపై ఓ అంచనాకు రావడం ద్వారా ముందస్తుగా దిద్దుబాటు చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
* 3 జిల్లాల్లో 43.01 లక్షల పేర్లు తొలగించే చాన్స్
రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించని 73.39 లక్షల ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితా నుంచి గల్లంతు కానున్నాయి. ఇందులో సుమారు 59 శాతం ఓట్లు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్) పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లాల్లో ఉండడం గమనార్హం. ఈ మూడు జిల్లాల్లో 43.01 లక్షల పేర్లు జాబితా నుంచి తొలగించే అవకాశముంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
