Nepal Flood Raipur Friends
* నేపాల్ వరదల్లో ఆశ్చర్యకర సందర్భం
* వరదల మద్య రాఖీ బంధం
* నేపాల్ వరదల్లో రాయ్‌పూర్ స్నేహితుల ఉత్కంఠభరిత ప్రయాణం
ఆకేరు న్యూస్, రాయ్‌పూర్ ( చత్తీష్ గఢ్ ) : నేపాల్ వెళ్లిన ఐదుగురు స్నేహితులు.. సరదాగా ఓ టీ తాగేందుకు ఆగారు. అదే టీ బ్రేక్ వారి ప్రాణాలను కాపాడుతుందని వాళ్లు అప్పట్లో ఊహించి కూడా ఉండరు. కొన్ని నిమిషాల తర్వాత అదే మార్గాన్ని వరదలు ముంచెత్తాయి. వాహనాలు, శిథిలాలు, మృతదేహాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోతుండటాన్ని కళ్లారా చూసిన వారు.. చివరకు రెండు రాత్రులు కారులోనే గడిపి సురక్షితంగా స్వస్థలానికి చేరుకున్నారు.
రాయ్‌పూర్‌లోని మనా క్యాంప్‌కు చెందిన నారాయణ్ సేన్, దినేశ్ ఓజా, ప్రేమ్ సింగ్ జగత్, యతేంద్ర ప్రకాశ్, దినేశ్ సింగ్ ఠాకూర్ అనే ఐదుగురు స్నేహితులు నేపాల్ పర్యటనకు వెళ్లారు. వీరి వయసు 50 నుంచి 60 ఏళ్ల మధ్య ఉంటుంది. ఆగస్టు 21న రాయ్‌పూర్ నుంచి బయలుదేరిన వారు మరుసటి రోజు నేపాల్ చేరుకున్నారు. పశుపతినాథ్, మనకామన ఆలయంతో పాటు పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఆగస్టు 26న వారి పర్యటన ఒక్కసారిగా భయానకంగా మారింది.
* టీ తాగేందుకు ఆగారు.. ప్రాణాలతో బయటపడ్డారు
కాఠ్మాండూ వైపు కారులో వెళ్తున్న సమయంలో ధాదింగ్ జిల్లాలోని మలేఖు ప్రాంతంలో ఓ హోటల్ వద్ద టీ తాగేందుకు ఐదుగురు ఆగారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ముందుకు వెళ్లాలనుకున్నారు. అయితే అప్పటికే ముందున్న వంతెన వరదల్లో కొట్టుకుపోయిందన్న సమాచారం వారికి అందింది. కొద్దిసేపటికే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో వారికి అర్థమైంది. భోటే కోషి, త్రిశూలీ నదీ లోయల్లో భారీ వరదలు సంభవించడంతో రహదారులు దెబ్బతిన్నాయి.
* అక్కడే ఆగిపోవడంతో..
వారు హోటల్లోనే ఉండిపోయారు. ఎత్తైన ప్రాంతం నుంచి చూస్తుండగానే ఉప్పొంగిన త్రిశూలీ నదిలోకి వాహనాలు, శిథిలాలు కొట్టుకుపోవడం చూశారు. కొన్ని చోట్ల మృతదేహాలు కూడా వరద ప్రవాహంలో కనిపించాయి. ఆ దృశ్యాలు తమను తీవ్రంగా కలచివేశాయని వారు తెలిపారు. తాము టీ తాగేందుకు అక్కడ ఆగకుండా కొన్ని నిమిషాల ముందే ప్రయాణం కొనసాగించి ఉంటే.. అదే వరదల్లో చిక్కుకునేవారమని తర్వాత గుర్తించారు.
* రెండు రాత్రులు కారులోనే..
వరద పరిస్థితులు వెంటనే చక్కబడకపోవడంతో ఐదుగురు స్నేహితులు రెండు రాత్రులు అక్కడే చిక్కుకుపోయారు. చివరకు కారులోనే రాత్రులు గడిపారు. విద్యుత్, నీటి సరఫరా లేకపోయినా స్థానికులు, పోలీసులు, అధికారులు వారికి అండగా నిలిచారు. హోటల్ నిర్వహిస్తున్న భారతీయుడు కూడా వారికి ఆహారం, ఆశ్రయం కల్పించాడు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందకుండా ఇంటర్నెట్ ద్వారా ఎప్పటికప్పుడు తమ పరిస్థితిని తెలియజేశారు. భారత ప్రభుత్వ అత్యవసర హెల్ప్‌లైన్‌ను కూడా సంప్రదించి తమ లొకేషన్‌ను పంచుకున్నారు.
* వరదల మధ్య రాఖీ బంధం
ఇంతటి భయానక పరిస్థితుల్లోనూ వారికి ఓ మధురమైన అనుభవం ఎదురైంది. స్థానిక మహిళా భద్రతా సిబ్బంది ఈ ఐదుగురు స్నేహితులకు రాఖీలు కట్టారు. తమ సోదరీమణులు ఇచ్చిన రాఖీలను కూడా వారు వెంట తీసుకెళ్లారు. రక్షాబంధన్ తర్వాత ఇంటికి తిరిగి వెళ్లాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ఊహించని పరిస్థితుల్లో స్థానిక మహిళలు రాఖీలు కట్టడంతో ఆ క్షణం తమకు ప్రత్యేకంగా నిలిచిపోయిందని వారు గుర్తుచేసుకున్నారు.
* చివరకు సురక్షితంగా ఇంటికి
ఆగస్టు 28న నేపాల్ నుంచి బయలుదేరిన ఐదుగురు స్నేహితులు శనివారం రాయ్‌పూర్ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనుకున్న వారి ప్రయాణం.. చివరకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడిపిన రెండు రోజులుగా మారింది. నేపాల్‌లో వరదల విధ్వంసాన్ని వారు కళ్లారా చూశారు. దెబ్బతిన్న గ్రామాలు, ధ్వంసమైన భవనాలు, తమ ఆత్మీయుల కోసం వెతుకుతున్న ప్రజలను చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
కొన్నిసార్లు మనం పెద్దగా పట్టించుకోని చిన్న నిర్ణయమే జీవితాన్ని మార్చేస్తుంది. ఈ ఐదుగురి విషయంలోనూ అదే జరిగింది. వాళ్లు తీసుకున్న ఆ చిన్న టీ బ్రేక్.. చివరకు వారి జీవితాల్లో మరచిపోలేని ప్రాణరక్షణగా మిగిలిపోయింది.
———————————————

Please tell us what is wrong. Your report will be sent to the website team.
