Tata Madhu Assembly Controversy
* శాసనసభలో తీవ్ర దుమారం
* బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలపై మండిపాటు
* అలా మాట్లాడితే రక్తం మరగదా ?
* ఎమ్మెల్యేగా తొలగించాలని సీఎం రేవంత్ ప్రతిపాదన
* కేసీఆర్ క్షమాపణ చెప్పాలి : బీజేపీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అసెంబ్లీ వేదికగా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభాపతి (స్పీకర్) గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి తీవ్ర పదజాలంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు వెలువడిన వార్తలు సభలో పెను దుమారాన్ని రేపాయి. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని సభా మర్యాదలకు, రాజ్యాంగ వ్యవస్థలకు జరిగిన తీవ్ర అవమానంగా పరిగణించింది.
* అసలేం జరిగింది ?
ప్రభుత్వ విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు రాసి ఉన్న నల్ల టీషర్ట్లు ధరించి అసెంబ్లీకి వచ్చారు. అయితే సభా నిబంధనల ప్రకారం అటువంటి దుస్తులతో లోపలికి అనుమతించబోమని పోలీసులు అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆరఎస్ ప్రజాప్రతినిధుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది.
* స్పీకర్‌పై ఆరోపణలు..
తోపులాట సమయంలో తాతా మధు తీవ్ర ఆగ్రహంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి ‘ఎవడ్రా స్పీకర్?’, ‘మీకు ఈ అధికారం ఎవరు ఇచ్చారు?’ అని ఏకవచనంతో సంబోధిస్తూ తీవ్ర పదజాలం వాడారని కాంగ్రెస్ వర్గాలు మండిపడ్డాయి. దళిత వర్గానికి చెందిన స్పీకర్‌ను ‘సార’ అని పిలవడం ఇష్టం లేకే కేసీఆర్ సభకు రావడం లేదనే తరహాలో మాట్లాడి దళితులను అవమానించారని కాంగ్రెస్ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
* నా మాటలు వక్రీకరించారు : తాతా మధు
తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్సీ తాతా మధు ఖండించారు. నిరసన సమయంలో పోలీసులు తన ప్యాంటు లాగి దురుసుగా ప్రవర్తించారని, నిరసన తెలిపే హక్కును అడ్డుకున్నందున పోలీసులపై మాత్రమే ఆగ్రహం వ్యక్తం చేశానని చెప్పారు. స్పీకర్ వ్యవస్థపై తనకు గౌరవముందని, కాంగ్రెస్ నాయకులు కావాలనే తన మాటలను వక్రీకరిస్తున్నారని స్పష్టం చేశారు.
* తాతా మధును బర్తరఫ్ చేయాలి
ఎవరికైనా వారి తల్లిని అవమానించే విధంగా మాట్లాడితే ఏ కొడుకుకైనా రక్తం మరగదా? అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలపై అసెంబ్లీలో తీవ్ర దుమారం రేగింది. సభాపతికి జరిగిన అవమానాన్ని.. తమకు జరిగిన అవమానంగా భావిస్తున్నామని తెలంగాణ సీఎం తెలిపారు. సభలో రేవంత్ మాట్లాడుతూ.. “రాబోయే తరానికి ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు సభలో వాడిన భాష, ఆ వ్యాఖ్యలను సమర్థించడానికి ప్రయత్నిస్తున్న తీరు అత్యంత విచారకరం. ప్రతిపక్ష నాయకుడు నిన్న సమావేశం ఏర్పాటు చేసి అవమానించేలా మాట్లాడుతున్నందుకే సభకు రావడం లేదని చెప్పారు. దీంతో సభలోకి వచ్చి మంచి సూచనలు చేస్తూ, అసెంబ్లీలో ప్రతినిధుల ప్రవర్తనపై ఒక స్వయం నియంత్రణ విధానాన్ని తెచ్చుకుందామని ప్రతిపాదిస్తారని నేను భావించాను. అందుకు విరుద్ధంగా తమ నేతలు వ్యవహరించేలా చేస్తున్నారు. సభలో జరిగిన ఈ సంఘటన కేవలం ఒక్కరికి మాత్రమే కాదు, మనందరికీ జరిగిన అవమానంగా భావిస్తున్నాను.” అని పేర్కొన్నారు.
* బీజేపీ వాళ్లు ఆలోచించాలి
మిత్రులారా.. చరిత్రలో మీరు తప్పు చేసిన వారిగా నిలవకండి, లేదా తప్పు చేసిన వారికి తోడుగా ఉండి చెడ్డ పేరు మూటగట్టుకోకండని బీజేపీ ఎమ్మెల్యేలకు సూచించారు. అందరూ ముక్తకంఠంతో ఈ రకమైన అనుచిత చర్యలను, భాషను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. సభా మర్యాదలను కాపాడేందుకు ప్రతిపక్ష సభ్యులు కూడా సహకరించాలని అసెంబ్లీ వేదికగా రేవంత్ పిలుపునిచ్చారు. తాతా మధు వ్యాఖ్యలపై వారి పార్టీ నేత కేసీఆర్ కూడా క్షమాపణ చెప్పాలని, లేదంటే బర్తరఫ్ చేయాలని రేవంత్ ప్రతిపాదనకు బీజేపీ ఆమోదం తెలిపింది.
* అసెంబ్లీలో అసభ్యకరమైన ప్రవర్తనను అరికట్టాలి : సీఎం
“వాళ్ల పార్టీ ఎమ్మెల్యే.. అసెంబ్లీలో అత్యంత అభ్యంతరకరమైన భాష ప్రయోగించినందుకు బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు తక్షణమే ప్రజలకు, సభకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా అనాగరికంగా మాట్లాడిన ఆ సభ్యుడి చేత రాజీనామా చేయించాలి లేదా సభ నుంచి అతడి సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ఇలాంటి అహంకారపూరిత, అసభ్యకరమైన ప్రవర్తనను అరికట్టడానికి ప్రభుత్వం, మొత్తం వ్యవస్థ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. 2007లో జెడ్పీటీసీగా, 2009లో ఎమ్మెల్సీగా, 2014, 2019ల్లో ఎమ్మెల్యేగా, ఆ తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా, నేడు తెలంగాణ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో నేను అన్ని సభలను చూశాను. నా ఈ అనుభవంలో గానీ, లేదా స్వాతంత్య్రం వచ్చిన ఈ 77 ఏళ్ల సుదీర్ఘ పార్లమెంటరీ చరిత్రలోనే ఏ సభ్యుడూ ఇంత అభ్యంతరకరమైన భాషను ఎప్పుడూ వాడలేదు.” అని సీఎం అన్నారు. ఇలాంటి ప్రవర్తన వల్ల సభకు ఉన్న విలువ, గౌరవ మర్యాదలు పూర్తిగా దెబ్బ తింటాయన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
