Vijayasai Reddy New Party
* ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్
* నేను సీఎం అభ్యర్థిని కాను.. మెంటార్గానే ఉంటా
ఆకేరు న్యూస్, డెస్క్: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడిస్తూ, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
* సీఎం అభ్యర్థిని కాను…
తాను స్థాపించబోయే కొత్త పార్టీకి తాను సీఏం అభ్యర్థిగా ఉండనని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. మహారాష్ట్రలో శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే ఏ విధంగా అయితే పార్టీకి మార్గదర్శకుడిగా ఉన్నారో, తాను కూడా ఈ పార్టీకి కేవలం ‘మెంటార్’ (Mentor) గానే వ్యవహరిస్తానని తెలిపారు. రాష్ట్ర సంక్షేమం, ప్రగతిపై సరైన అవగాహన, అనుభవం, సమర్థత ఉన్న ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా తమ పార్టీ తరఫున సీఎం కావచ్చు అని పేర్కొన్నారు.
* కుటుంబ రాజకీయాలకు చెక్ – Gen-Zకి 66 శాతం సీట్లు..
టీడీపీ, వైసీపీ కేవలం రెండు కుటుంబాల స్వార్థ రాజకీయాల కోసం, రాష్ట్ర సంపదను పంచుకోవడానికే పరిమితమయ్యాయని సాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ రెండు పార్టీల వల్ల సామాన్య ప్రజలపై భారం పెరుగుతోందని, ఏ పని జరగాలన్నా రౌడీ మామూళ్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఈ క్రమంలోనే రాబోయే 2029 ఎన్నికల నాటికి 25 ఏళ్ల నుండి 40 ఏళ్ల మధ్య ఉన్న యువతకు (Gen-Z) అసెంబ్లీ, పార్లమెంట్ మరియు నామినేటెడ్ పదవుల్లో ఏకంగా 66 శాతం సీట్లు కేటాయిస్తామని సంచలన హామీ ఇచ్చారు.
* త్వరలోనే జెండా, అజెండా…
రాష్ట్రంలో కాపులు, బీసీలు, వెలమలు, మైనారిటీలకు తగిన గుర్తింపు దక్కడం లేదని, వారికి సరైన రాజ్యాధికారం అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు పార్టీ ఆవశ్యకతను వివరిస్తానని, అతిత్వరలోనే పార్టీ పేరు, జెండా, అజెండాను వెల్లడిస్తానని చెప్పారు. విజయసాయిరెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
