Epic First Semester Aditya Hasan
* ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటుంది
* 90sకు కొనసాగింపుగా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ – దర్శకుడు ఆదిత్య హాసన్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ‘90s’ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న యువ దర్శకుడు ఆదిత్య హాసన్ వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఆదిత్య హాసన్ మీడియాతో ముచ్చటించి సినిమా, తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
* వనపర్తి నుంచి సినీ పరిశ్రమలోకి
తనది వనపర్తి అని, పదో తరగతి వరకు అక్కడే చదువుకున్నానని ఆదిత్య హాసన్ తెలిపారు. తన తండ్రి స్కూల్ టీచర్‌గా రిటైర్ అయ్యారని, తల్లి హౌస్‌వైఫ్ అని చెప్పారు. పదో తరగతి తర్వాత సినిమాలపై ఆసక్తి పెరిగిందని, ఎవరి దగ్గరా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయలేదన్నారు. హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తి చేసి, మాస్టర్స్ కోసం యూకే వెళ్లానని చెప్పారు. అప్పటికే షార్ట్ ఫిలిమ్స్ చేసిన తాను.. యూకే నుంచి తిరిగొచ్చిన తర్వాత సినిమా ప్రయత్నాలు ప్రారంభించానన్నారు. ఆ సమయంలో కలర్స్ స్వాతితో ‘టీచర్’ అనే సినిమా చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయిందని తెలిపారు.
తన అసలు పేరు ఆదిత్య అని, తాను కమల్ హాసన్‌కు వీరాభిమానినని దర్శకుడు తెలిపారు. ఆ అభిమానంతోనే తన పేరును ఆదిత్య హాసన్‌గా మార్చుకున్నట్లు చెప్పారు.
* నా బయోపిక్ కాదు
‘ఎపిక్’లో తన నిజ జీవిత సంఘటనల స్ఫూర్తి ఉంటుందని, అయితే అది పూర్తిగా తన బయోపిక్ కాదని ఆదిత్య హాసన్ స్పష్టం చేశారు. తన జీవితం అంత అందంగా లేదని నవ్వుతూ చెప్పారు. కథ కోసం కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నామని తెలిపారు. ‘90s’లో కూడా తమ ఊరు, కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నప్పటికీ ప్రతి సంఘటన తన జీవితంలో జరిగినది కాదని చెప్పారు. వివిధ జీవితాల్లో జరిగిన సంఘటనలను తీసుకుని వాటిని ఒక కథగా రూపొందించినట్లు వివరించారు.
‘ఎపిక్’ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని ఆదిత్య హాసన్ తెలిపారు. నిజ జీవితంలోని కొన్ని అందమైన సంఘటనల ఆధారంగా కథ సాగుతుందని చెప్పారు. ‘90s’ వెబ్ సిరీస్‌కు ఇది ఒక రకంగా కొనసాగింపని, అందులోని తమ్ముడి జీవితంలోని ఒక భాగం ‘ఎపిక్’ కథగా ఉంటుందని వెల్లడించారు. భవిష్యత్తులో అదే కుటుంబంలోని అన్న, అక్క జీవితాలను కూడా వేర్వేరు కథలుగా చూపించే ఆలోచన ఉందన్నారు.
‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ కథకు కొనసాగింపు ఉంటుందని దర్శకుడు తెలిపారు. ‘ఎపిక్ – ఫైనల్ సెమిస్టర్’ పేరుతో కథను కొనసాగించనున్నట్లు చెప్పారు. మొదటి భాగానికి ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా కాకుండా.. కథకు అవసరమైన ముగింపును ఇచ్చామని వెల్లడించారు.
* ‘బేబీ’ జోడితో ఒత్తిడి అనిపించింది
‘బేబీ’ సినిమాలో కలిసి నటించిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యతో సినిమా చేయడం మొదట్లో కొంత ఒత్తిడిగా అనిపించిందని ఆదిత్య హాసన్ చెప్పారు. అయితే ‘ఎపిక్’ ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతిని ఇస్తుందని తెలిపారు. హీరోగా ఆనంద్‌ను తానే ఎంపిక చేసుకున్నానని, హీరోయిన్గా వైష్ణవి పేరును నిర్మాత నాగవంశీ సూచించారని చెప్పారు. ఈ జోడీ సినిమాకు కమర్షియల్‌గా ఉపయోగపడుతుందని నాగవంశీ చెప్పినప్పుడు పూర్తిగా అర్థం కాలేదని, సినిమా మీద వచ్చిన హైప్ చూసిన తర్వాత ఆయన మాట నిజమని అర్థమైందన్నారు.
ఎపిక్ ను గొప్ప కథ అని చెప్పనని ఆదిత్య హాసన్ అన్నారు. హైదరాబాద్ నుంచి యూకే వెళ్లిన ఓ యువకుడు అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించడం, చివరకు వారిద్దరూ ఒక్కటయ్యారా లేదా అనేదే ప్రధాన కథ అని తెలిపారు. ‘90s’ ఎంత సహజంగా ఉంటుందో ‘ఎపిక్’ కూడా అంతే సహజంగా ఉంటుందని చెప్పారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల జీవితం, అక్కడి బంధాల గురించి ఎక్కువగా సినిమాలు రాలేదని, తాను యూకేలో చదువుకున్నందున అక్కడి పరిస్థితులు తనకు తెలుసని తెలిపారు. అందుకే ఈ కథను ప్రేక్షకులకు చెప్పాలనుకున్నట్లు చెప్పారు.
* నాగవంశీపై ప్రశంసలు
‘90s’ వెబ్ సిరీస్ చూసి తనను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత నాగవంశీకి ఆదిత్య హాసన్ కృతజ్ఞతలు తెలిపారు. సినిమా విషయంలో ఆయన ప్రతిదీ దగ్గరుండి చూసుకున్నారని చెప్పారు. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఎంపిక కూడా నాగవంశీదేనని వెల్లడించారు.
* ‘సంచారమే’తో ప్రమోషన్స్
చిన్నప్పటి నుంచి గోరటి వెంకన్న అంటే తనకు ఎంతో అభిమానమని ఆదిత్య హాసన్ తెలిపారు. లండన్‌లో చదువుకునే సమయంలో కూడా ఆయన పాటలు వినేవాడినని చెప్పారు. తన మొదటి సినిమాలో కచ్చితంగా గోరటి వెంకన్న పాట ఉండాలని అనుకున్నానని, అందుకే ‘ఎపిక్’ కోసం ఆయనతో ‘సంచారమే’ పాట రాయించి, పాడించి.. అదే పాటతో ప్రమోషన్స్ ప్రారంభించామని తెలిపారు.
భవిష్యత్తులో అన్ని రకాల సినిమాలు చేయాలని ఉందని ఆదిత్య హాసన్ అన్నారు. వినోదాన్ని అందిస్తూనే విభిన్న జానర్లలో సినిమాలు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఎవరినీ కించపరచకుండా, ఎలాంటి అజెండాలు లేకుండా విలువలతో కూడిన సినిమాలు అందించడమే తన లక్ష్యమని చెప్పారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
