Deputy CM Pawan Kalyan, Chittoor Drinking Water Project
* నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
* కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ
* డిప్యూటీ సీఎం పవన్ పర్యవేక్షణ
ఆకేరు న్యూస్, అమరావతి: ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతంలో తీవ్రంగా వేధిస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చర్యలు చేపట్టింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ, పర్యవేక్షణలో జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధారల సంయుక్త ఆధ్వర్యంలో రూ. 2,370 కోట్ల భారీ అంచనా వ్యయంతో ఈ మెగా తాగునీటి ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
* మొదటి విడతలో రూ. 7,910 కోట్లతో..
ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశయానికి అనుగుణంగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రత్యేక చొరవ చూపింది. 2024తో ముగియాల్సిన జల్ జీవన్ మిషన్ గడువును కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 2028 వరకు పొడిగించుకుంది. ఇందులో భాగంగా చేపట్టిన జల్ జీవన్ మిషన్ 2.0 కింద సుమారు రూ. 26,000 కోట్ల విలువైన తాగునీటి ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. మొదటి విడతలో భాగంగా రూ. 7,910 కోట్లతో ఐదు జిల్లాల్లో చేపట్టిన ఐదు మెగా వాటర్ గ్రిడ్ పథకాల్లో చిత్తూరు జిల్లా పథకం అత్యంత కీలమైనది.
* 25 లక్షల మందికి తాగునీటి భద్రత
గండికోట, వెలిగల్లు జలాశయాలను ప్రధాన నీటి వనరులుగా వినియోగిస్తూ రూపొందించిన ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని మూడు నియోజకవర్గాల పరిధిలోని 18 మండలాలు, 3,163 ఆవాసాలకు సురక్షితమైన తాగునీరు అందనుంది. ఈ బృహత్తర పథకం ద్వారా దాదాపు 25 లక్షల మంది ప్రజల తాగునీటి భద్రత నెరవేరనుంది. ఈ ప్రాజెక్టు కింద ఇప్పటికే దాదాపు 130 కిలోమీటర్ల మేర పైప్లైన్ నిర్మాణం పూర్తికావడం విశేషం.
* జోరుగా నీటి శుద్ధి కేంద్రాల నిర్ణయం
క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేసేందుకు అధికారులు వారాంతపు మరియు నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వివిధ శాఖల నుంచి అనుమతులు పొందడంలోనూ, నిర్మాణ పనుల్లోనూ ఎలాంటి జాప్యం జరగకుండా ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. గండికోట వద్ద ఇంటేక్ వెల్ నిర్మాణం పురోగతిలో ఉండగా, నిర్దేశిత నాలుగు రా వాటర్ సంపుల్లో మూడు పనులు వేగంగా సాగుతున్నాయి. అలాగే గుర్రంకొండ వద్ద 75 మిలియన్ లీటర్లు, వెలిగల్లు వద్ద 26 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో అత్యాధునిక నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. వీటితో పాటు ఏడు నీటి సంపులు, ఐదు ఓవర్హెడ్ ట్యాంకులు, 14 గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు సహా మొత్తం 167 వివిధ రకాల నిర్మాణాలు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాయి.
* పవన్ కీలక ఆదేశాలు
ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా, ఎటువంటి నాణ్యతా లోపాలు లేకుండా దీర్ఘకాలం ప్రజలకు సేవనందించేలా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని పవన్ కళ్యాణ్ అధికారులను హెచ్చరించారు. నిర్దేశిత గడువులోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, తద్వారా పశ్చిమ చిత్తూరు ప్రాంతంలో దశాబ్దాల నీటి ఎద్దడికి తెరదించాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
