BRS Leaders Arrests Telangana
* ఆందోళనల పిలుపు నేపథ్యంలో చర్యలు
* అలర్ట్ అయిన పోలీసులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
అసెంబ్లీ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఆ పార్టీ చేపట్టిన ఆందోళనలతో రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాసనసభా హక్కుల ఉల్లంఘన, పోలీసుల ప్రవర్తనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పొలీసులు రంగంలోకి దిగి ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేస్తున్నారు.
* భారీగా పోలీసులు
హైదరాబాద్ జంట నగరాలతో పాటు జిల్లాల్లోనూ ప్రధాన నాయకుల నివాసాల వద్ద ఉదయం నుంచే భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్‌ను మోండా మార్కెట్లోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే మారేడుపల్లి, కార్ఖానా పోలీస్ స్టేషన్ల పరిధిలోని కృష్ణానగర్ కాలనీలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌ను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
* నిద్రలేపి మరీ..
మరోవైపు కుషాయిగూడ, అల్వాల్, ఉప్పల్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లోని స్థానిక బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను ఉదయాన్నే నిద్రలేపి మరీ ముందస్తుగా అరెస్టు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందని, నిరసన గురించిన ప్రకటన రాగానే పోలీసులతో ఇళ్లను ముట్టడించడం దారుణమని అరెస్ట్ అయిన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పలు చోట్ల కార్యకర్తలు ఆందోళనకు యత్నించారు.
* భయపడేది లే..
శాసనసభలో, వెలుపల ప్రతిపక్ష గొంతు నొక్కేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, ఇటువంటి ముందస్తు అరెస్టులకు భయపడేది లేదని బీఆర్ఎస్ శ్రేణులు స్పష్టం చేశాయి. అరెస్టు చేసిన తమ నాయకులను వెంటనే భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ప్రధాన కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి, అదనపు బలగాలను రంగంలోకి దించడంతో రాజధానిలోని పలు ప్రధాన ప్రాంతాల్లో ఆంక్షల వాతావరణం కనిపించింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
