TPCC Cheif Mahesh Kumar Goud
* తెలంగాణలో మనువాద పార్టీ అవసరంలేదు
* తెలంగాణ పీసీసీ చీఫ్ ధ్వజం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో బీఆర్ఎస్ కు మనుగడ లేదని, ఆ పార్టీని పూర్తిగా రద్దు చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ మనువాద, ఎస్సీ వ్యతిరేక ఆలోచనా విధానం ఉన్న పార్టీ అని విమర్శించారు. అహంకారపూరిత రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీ అవసరం తెలంగాణ సమాజానికి ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు.
* ఆయనను అధ్యక్షా అనలేకే..
దళిత, గిరిజన నాయకులు కీలక స్థానాల్లోకి రావడం బీఆర్ఎస్ అగ్రనేతలకు అస్సలు గిట్టడం లేదని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బహుజన వర్గానికి చెందిన భట్టి విక్రమార్క కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా, ఉప ముఖ్యమంత్రిగా ఎదగడాన్ని బీఆర్ఎస్ తట్టుకోలేకపోతోందన్నారు. అలాగే శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ బాధ్యతలు చేపట్టడాన్ని ఓర్వలేకే, ఆయనను సభలో ‘అధ్యక్షా’ అని సంభోదించడం ఇష్టం లేకనే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా ముఖం చాటేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
* అనాగరిక వ్యాఖ్యలు
శాసనసభలో ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజా సమస్యలపై చర్చించాల్సిన బీఆర్ఎస్ నేతలు, సభా మర్యాదలను కాలరాస్తూ అనాగరిక వ్యాఖ్యలకు దిగుతున్నారని పీసీసీ చీఫ్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, విద్యార్థుల సమస్యలు మరియు జల వనరుల రక్షణపై శాసనసభలో పారదర్శకంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, సభను సజావుగా సాగనీయకుండా బీఆర్ఎస్ సభ్యులు నిరంతరం గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు.
* రద్దు చేయాలని డిమాండ్
సభలో మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన ఘటనలను సాకుగా చూపిస్తూ అసెంబ్లీకి రాకుండా పారిపోవడం ద్వారా కేసీఆర్, ఆయన అనుచరులు తమ అహంకారాన్ని మరోసారి బయటపెట్టుకున్నారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను, రాజ్యాంగబద్ధ పదవులను గౌరవించని బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ ముందుకు వెళ్తుందని, సభలో విద్యార్థుల, పేదల హక్కులను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
