Aruri Ramesh BRS Protest in Wardhannapet
* కాంగ్రెస్ హామీలపై అరూరి రమేష్ ఫైర్
అకేరు న్యూస్, వరంగల్ : అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ వర్ధన్నపేటలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. వర్ధన్నపేటలో నిర్వహించాల్సిన నిరసన కార్యక్రమానికి పోలీసులు అడ్డంకులు కల్పించడంతో ఐనవోలు మండల కేంద్రంలో మహిళలతో కలిసి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ నిరసనలో పాల్గొన్నారు.
అరూరి రమేష్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీ వద్ద జరిగిన ఘటన బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకే కాకుండా తెలంగాణ మహిళా లోకానికే అవమానమని అన్నారు.
* రేవంత్ క్షమాపణ చెప్పాలి
ఈ ఘటన పై సీఏం రేవంత్ రెడ్డి బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలని అరూరి డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే రాష్ట్రంలోని సామాన్య మహిళలకు ఎలాంటి భద్రత ఉంటుందని నిలదీశారు.
* 6 గ్యారంటీలు ఏమయ్యాయి?
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలుపై అరూరి రమేష్ ప్రశ్నలు సంధించారు. ఇప్పటివరకు ఎన్ని హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
* ఉద్యోగ హామీలపై నిలదీత
పోలీస్ శాఖలో 20 వేల ఉద్యోగాలు, డీఎస్సీ ద్వారా 50 వేల ఉపాధ్యాయ పోస్టులతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగాల హామీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని బీఆర్ఎస్ నేతలు అన్నారు.
* సమస్యలపై పోరాటం
రైతు బీమా, రైతుబంధు వంటి పథకాల ద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని అరూరి రమేష్ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుబంధు నిధుల విషయంలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి మాజీ అధ్యక్షురాలు ఎల్లవుల లలిత యాదవ్, మాజీ జడ్పీటీసీ సునీత, మహిళా నాయకులు మాధవి, స్వరూప, రజిత, విజయ, రాణి, అర్చన, లావణ్యతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
