PM Awas Yojana
* ఏపీకి 3 లక్షలు.. తెలంగాణకు 2 లక్షలు
PM Awas Yojana: ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీగా ఇళ్లను కేటాయించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కలిపి మొత్తం 5 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఇందులో ఏపీకి 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు.
ఏపీకి 3 లక్షలు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్రానికి అదనంగా ఇళ్లను కేటాయించినట్లు పెమ్మసాని తెలిపారు. 2019-24 మధ్య ఏపీకి 1.78 లక్షల ఇళ్లు కేటాయించగా, వాటిలో 42 వేల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని చెప్పారు.
తెలంగాణకు 2 లక్షలు
2019-24 మధ్య గ్రామీణ ఆవాస్ యోజన పథకంలో తెలంగాణ చేరకపోవడంతో ఇళ్ల కేటాయింపులో నష్టం జరిగిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి గ్రామీణ ఇళ్ల కోసం కేంద్రాన్ని పలుమార్లు కోరారని, దీంతో తెలంగాణకు 2 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు వివరించారు.
రూ.1.80 లక్షల సాయం
ఒక్కో ఇంటికి రూ.1.20 లక్షల ప్రాథమిక సహాయం అందిస్తామని పెమ్మసాని తెలిపారు. అదనపు సాయంతో కలిపి మొత్తం రూ.1.80 లక్షలు అందుతుందని చెప్పారు. స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేల సహాయం ఉంటుందని తెలిపారు.
నిబంధనల్లో మార్పులు
మోటార్ బైక్, ఫ్రిడ్జ్ ఉన్న కుటుంబాలు అర్హత కోల్పోకుండా కేంద్రం నిబంధనల్లో మార్పులు చేసిందని చెప్పారు. ఆదాయ అర్హత పరిమితిని రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచినట్లు వెల్లడించారు. ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
