* పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కిన చిన్నారులు
* ఇప్పటికే కరిచాయ్ అంటూ ఆవేదన
* అధికారులపై చర్యలు తీసుకోవాలని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
* స్పందించండి సీఎం అంకుల్ అంటూ ప్లకార్డుల ప్రదర్శన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వీధి కుక్కల దాడుల తీవ్రతకు ఈ ఘటన అద్దం పడుతోంది. కుక్కల బారిన పడి గాయాలపాలవుతున్న, చనిపోతున్న దారుణాలతో చిన్నారులు, తల్లిదండ్రులు ఎంతలా ఆందోళన చెందుతున్నారో తెలియజేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అంకుల్, కమిషనర్ అంకుల్, ఎమ్మెల్యే వివేక్ అంకుల్.. కుక్కులు కరుస్తున్నాయ్.. మమ్మల్ని కాపాడండి.. అంటూ చిన్నారులు ప్లకార్డులు పట్టుకునీ మరీ విన్నవిస్తున్నారు. అంతేకాదు.. తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్(Police Stion)కు సైతం చేరుకున్నారు. తమను కుక్కల బారి నుంచి కాపాడాలని కొంపల్లి మునిసిపల్ కమిషనర్ (Kompally Municipal Commissioner) కు, చైర్మన్ (Chairman) కు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం ఉండడం లేదని, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు పలువురు చిన్నారులు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
కుత్బుల్లాపూర్ నియోజవర్గం (Quthbullapur Constituency) కొంపల్లి లోని పలు కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తూ.. దొరికిన వాళ్ళని వేటాడుతున్నాయి. దీనిపై అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినా తగిన చర్యలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కొంపల్లి మున్సిపల్ కమిషనర్, చైర్మన్ ల పై చర్యలు తీసుకోవాలని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ (Petbashirabad Police Station) లో పలు కాలనీలకు చెందిన చిన్నారులు ఫిర్యాదు చేశారు. ఇంత మంది పిల్లలు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ కు రావడం చర్చనీయాంశంగా మారింది. కాలనీల్లో ప్రజలు బయటకు రాలేనంతగా, కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని, వాటి బారి నుంచి తమకు రక్షణ కల్పించాలని ఎన్నో సార్లు మున్సిపల్ అధికారులకు తెలిపినా కనీస జాగ్రత్తలు తీసుకోకుండా అలసత్వం వహిస్తున్నారని ఆ చిన్నారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అధికారుల పై చర్యలు తీసుకోవాలని, అలాగే సిఎం రేవంత్ రెడ్డి అంకుల్, కమిషనర్ అంకుల్, స్థానిక ఎమ్మెల్యే వివేక్ అంకుల్ తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఇప్పటికే ఓసారి తనను, తన అమ్మను కుక్క కరిచిందని, స్కూలుకు వెళ్లాలంటేనే భయం వేస్తోందని ఓ చిన్నారి వచ్చీరాని మాటలతో తన భయాన్ని వెలిబుచ్చడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.
———————-