Mulugu Collector
Mulugu Collector: ఆకేరు న్యూస్, ములుగు: తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న అర్హులైన ఎస్సీ, ఎస్టీ రోగులు ‘డాక్టర్ అంబేడ్కర్ మెడికల్ ఎయిడ్ స్కీమ్’ ద్వారా అందించే వైద్య ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు కోరారు.
రూ.5 లక్షల్లోపు ఆదాయం
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని డాక్టర్ అంబేడ్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పథకం అమలవుతోందని కలెక్టర్ తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలంటే రోగి ఎస్సీ లేదా ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారై ఉండాలని, కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించకూడదని పేర్కొన్నారు.
ఏ చికిత్సలకు వర్తిస్తుంది?
గుండె శస్త్రచికిత్సలు, మూత్రపిండ వ్యాధులకు డయాలసిస్, క్యాన్సర్కు కీమోథెరపీ, రేడియోథెరపీ, మెదడు శస్త్రచికిత్సలు, మూత్రపిండాలు, కాలేయం తదితర అవయవాల మార్పిడి, వెన్నెముక శస్త్రచికిత్సలతో పాటు ఇతర ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు ఈ పథకం కింద ఆర్థిక సహాయం పొందవచ్చని తెలిపారు. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలు (AIIMS), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుబంధ ఆసుపత్రులు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) గుర్తింపు పొందిన ఆసుపత్రులతోపాటు డాక్టర్ అంబేడ్కర్ ఫౌండేషన్ మార్గదర్శకాల ప్రకారం అర్హత పొందిన గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగులు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.
15 రోజుల ముందే దరఖాస్తు
అర్హులైన రోగులు సాధారణ కాగితంపై దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. దరఖాస్తుతో పాటు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, రోగి ఫొటో, సంబంధిత ఆసుపత్రి వైద్య పర్యవేక్షకుడు ధ్రువీకరించిన చికిత్స అంచనా వ్యయం, ప్రతిపాదిత చికిత్స, శస్త్రచికిత్స తేదీ వివరాలను జత చేయాలని సూచించారు.
పూర్తి చేసిన దరఖాస్తును ప్రతిపాదిత శస్త్రచికిత్స, డయాలసిస్, కీమోథెరపీ లేదా ఇతర చికిత్స తేదీకి కనీసం 15 రోజుల ముందుగా డైరెక్టర్, డాక్టర్ అంబేడ్కర్ ఫౌండేషన్, 15, జన్పథ్, న్యూఢిల్లీ–110001 చిరునామాకు పంపించాలని తెలిపారు. జిల్లాలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ రోగులకు ఈ పథకంపై విస్తృత అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అర్హులైన రోగులు అవసరమైన ధ్రువపత్రాలతో నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకుని వైద్య సహాయం పొందాలని ఆయన కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
