Aviation Training
Aviation Training: ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులకు విమానయాన రంగంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఏరోస్పేస్, విమాన నిర్వహణ రంగాల్లో ప్రాక్టికల్ శిక్షణ అందించేందుకు తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ (TGSAA), సాంకేతిక విద్యాశాఖ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
* 2,100 గంటల ప్రాక్టికల్ ట్రైనింగ్
ఈ ఒప్పందం ద్వారా హైదరాబాద్ రామంతాపూర్లోని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ (JNGP)లో Aircraft Maintenance Engineering (AME) ట్రైనింగ్ డిప్లొమా చదువుతున్న విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ లభించనుంది. మూడేళ్ల కోర్సులో మొదటి రెండేళ్లు థియరీ, ల్యాబ్ ప్రాక్టికల్స్, ఎయిర్క్రాఫ్ట్ ఫ్యామిలియరైజేషన్, విమాన వ్యవస్థలపై శిక్షణ ఇస్తారు. మూడో ఏడాదిలో TGSAA ప్రాంగణంలో ఏడాది పాటు 2,100 గంటల ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అందిస్తారు. విమానాల తనిఖీ, నిర్వహణ, రిపేర్ ప్రక్రియలను ప్రత్యక్షంగా నేర్చుకునే అవకాశం విద్యార్థులకు కల్పిస్తారు.
* పరిశ్రమలతో ప్రత్యక్ష అనుసంధానం
TGSAAలో అనుభవజ్ఞులైన ఏవియేషన్ శిక్షకులతో పాటు ఆధునిక ప్రాక్టికల్ ల్యాబొరేటరీలు, విమానాలపై శిక్షణ వంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఎయిర్లైన్స్, ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్, ఎయిర్క్రాఫ్ట్ ఆపరేటర్లు, MRO సంస్థలు, ఏరోనాటికల్ తయారీ, ఏరోస్పేస్ రంగాలపై విద్యార్థులకు పరిశ్రమ అనుభవం లభించనుంది.విమానయాన భద్రతకు కూడా శిక్షణలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. AAI, BCAS నిబంధనలకు అనుగుణంగా సేఫ్టీ, సెక్యూరిటీ బ్రీఫింగ్స్ నిర్వహిస్తారు.
* ఐదేళ్ల పాటు ఒప్పందం
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె. కేశవరావు సమక్షంలో ఈ MoU కుదిరింది. కాలేజియేట్ విద్య, సాంకేతిక విద్య కమిషనర్ శ్రీదేవసేనతో పాటు సంబంధిత శాఖలు, ఏవియేషన్ అకాడమీ అధికారులు పాల్గొన్నారు. సంతకం చేసిన తేదీ నుంచి ఈ ఒప్పందం ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో భవిష్యత్తులో ఒప్పందాన్ని పునరుద్ధరించుకునే అవకాశం ఉంది. ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా Industry-Readyగా తీర్చిదిద్దే లక్ష్యంతో శిక్షణ అందించనున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
