Chandrababu Naidu
* ప్రకృతి సేద్యమే శ్రీరామరక్ష
* రసాయన ఎరువులను వాడి నేలను కలుషితం చేయొద్దు
* కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు
* లబ్ధిదారులతో ముఖాముఖి
ఆకేరు న్యూస్, కుప్పం : తన సొంత నియోజకవర్గం కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో వివిధ వర్గాల ప్రజలు, రైతులు, గృహిణులు, ఉద్యోగులు, యువత మరియు వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, పథకాల లబ్ధిపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. హంద్రీనీవా కాలువ ఎలా ఉందని ఓ రైతును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, పొలాల్లో అధికంగా రసాయన ఎరువులను వాడి నేలను, పంటలను కలుషితం చేయవద్దని హితవు పలికారు. వాతావరణ సమతుల్యం దెబ్బతినడం వల్లే ఎల్ నినో లాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని, వర్షాభావం కారణంగా కృష్ణా, గోదావరి నదులకు ఆశించిన స్థాయిలో నీరు రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్పష్టం చేశారు.
ప్రకృతి సేద్యమే శ్రీరామరక్ష
సేంద్రీయ ఎరువుల వాడకం ద్వారా జీవవైవిధ్యాన్ని పునరుద్ధరించి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్రకృతి సేద్యమే శ్రీరామరక్ష అనే సూత్రాన్ని ప్రతీ రైతు పాటిస్తూ ముందుకు సాగాలన్నారు. బయోచార్ వంటి ఆధునిక, సహజ సిద్ధమైన పద్ధతులను అవలంబించి భూమికి సారాన్ని, తేమను పెంచాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని, ఈ సంఖ్యను మరింతగా పెంచడమే లక్ష్యమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ‘పీఎండీఎస్’ విధానంతో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని, భూములను ఖాళీగా ఉంచకుండా ఎల్లప్పుడూ పచ్చదనంతో ఉంచాలని కోరారు. కరవు నివారణే ధ్యేయంగా దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేస్తామని వెల్లడించారు.
నన్ను మహిళా పారిశ్రామికవేత్తగా చేసిన..
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీ4 కార్యక్రమం ద్వారా ఎలాంటి లబ్ధి పొందారని లక్ష్మి అనే మహిళను సీఎం చంద్రబాబు అడిగారు. ఇటుకల బట్టీ ఏర్పాటుకు సహకారం అందించి, తనను ఒక మహిళా పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దిన సీఎం చంద్రబాబుకు, టీవీఎస్ సంస్థకు లబ్ధిదారు లక్ష్మి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
దీనిపై సీఎం స్పందిస్తూ.. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. టీవీఎస్, అదానీ, మెగా వంటి ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చి 8,900 మందిని దత్తత తీసుకుని, ‘బంగారు కుటుంబాల’ను ఆర్థికంగా నిలబెడుతున్నాయని అభినందించారు. అలాగే కుప్పంలోని ఓ కంపెనీలో ఉద్యోగం సాధించిన సురేఖ అనే యువతిని ప్రశంసిస్తూ, ప్రతి ఇంట్లోనూ స్టార్టప్ కంపెనీలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రావాలని ఆకాంక్షించారు.
అడుగడుగునా అభివృద్ధి
కుప్పంలో జరిగిన అభివృద్ధి వల్ల తమకు కలిగిన ప్రయోజనాలను స్థానిక ప్రజలు, లబ్ధిదారులు సీఎంకు వివరించారు. కుప్పం మెడికల్ కాలేజీ అత్యవసర సమయంలో సేవలు అందించి తన తండ్రి ప్రాణాలను కాపాడిందని సుబ్రహ్మణ్యం అనే యువ పారిశ్రామికవేత్త ఆనందం వ్యక్తం చేశారు. కుప్పంలోని ప్రతి రోడ్డు, ప్రతి నీటి చుక్కలోనూ, ప్రతి అడుగులోనూ సీఎం చంద్రబాబు విజన్ కనపడుతోందని ఒక యువకుడు కొనియాడారు. తాము ఇక్కడ తయారు చేస్తున్న ఆర్గానిక్ ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ విక్రయిస్తున్నామని వివరించారు.
యువకులకు సత్కారం
సభ ప్రాంగణంలోనే హంద్రీనీవా సుజల స్రవంతి కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా నీటి ప్రవాహం వస్తున్న దృశ్యాలను ప్రత్యక్షంగా లైవ్ వీడియో ప్రదర్శించారు. ఆ కాలువ వద్ద ఉన్న కొందరు మహిళా రైతులతో సీఎం లైవ్ ద్వారా మాట్లాడారు. చివరగా, కడా నిర్వహించిన కుప్పం అభివృద్ధి వీడియో కాంటెస్ట్‌లో విజేతలుగా నిలిచిన సుబ్రహ్మణ్యం, విక్కీ అనే యువకులను సీఎం చంద్రబాబు సత్కరించి, వారి ప్రతిభను ప్రశంసించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
