Devulapalli Sudarshan Rao
* శతజయంతి వేళ వెలుగులోకి..
మరుగునపడిన సాహితీ శిఖరం
* దేవులపల్లి సుదర్శన్రావు శతజయంతి
* బహుభాషా సాహితీ ప్రస్థానం
ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణ నేల ఎన్నో ఉద్యమాలకు, అనేక సాహిత్య ప్రవాహాలకు, అసంఖ్యాకమైన సృజనశీలులకు జన్మనిచ్చింది. తమ కాలంలో సాహిత్యరంగాన్ని గాఢంగా ప్రభావితం చేసినప్పటికీ, కాలగమనంలో కొందరు రచయితల పేర్లు, వారి రచనలు క్రమంగా పాఠకుల జ్ఞాపకాల నుంచి దూరమవుతుంటాయి. అలాంటి అరుదైన, మేధావి సాహితీ వ్యక్తిత్వాలలో కీ.శే. దేవులపల్లి సుదర్శన్రావు ఒకరు. 1926 సెప్టెంబర్ 12న జన్మించిన దేవులపల్లి సుదర్శన్రావు శతజయంతి సందర్భంగా ఆయన సాహిత్య ప్రస్థానాన్ని మరోసారి స్మరించుకోవడం తెలంగాణ సాహిత్య లోకానికి ఒక విశిష్ట సందర్భం.
* బొల్లికుంట నుంచి సాహిత్య ప్రపంచం వరకు…
హన్మకొండ తాలూకా, ఓరుగల్లు జిల్లాకు చెందిన బొల్లికుంట సుదర్శన్రావు గారి స్వగ్రామం. వృత్తిరీత్యా కరణంగా, పట్వారీగా బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ, ఆయనకు ఉద్యోగం కేవలం జీవనోపాధి మాత్రమే అయింది. సాహిత్యం మాత్రం ఆయనకు నిజమైన జీవన సాధనగా మారింది. తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషలపై ఆయనకు ఉన్న అపారమైన పట్టు ఆయన సాహిత్య వ్యక్తిత్వానికి అరుదైన విస్తృతిని, ప్రత్యేకతను తెచ్చిపెట్టింది.
* వరంగల్ సాహిత్య వాతావరణం – పత్రికా చైతన్యం
చారిత్రక వరంగల్ హన్మకొండ ప్రాంతానికి సుసంపన్నమైన సాహిత్య చరిత్ర ఉంది. కాళోజీ నారాయణరావు వంటి మహనీయుల సాహిత్య ప్రభావం, మిత్రమండలి వంటి వేదికలు ఆ ప్రాంతంలో గొప్ప సృజనాత్మక వాతావరణాన్ని నిర్మించాయి. ఈ సాహిత్య పరిసరాల్లో సుదర్శన్రావు గారు తనదైన స్వరాన్ని వినిపించారు. పాత వరంగల్ పత్రికా చరిత్రను పరిశీలిస్తే, 1960లలో ఆయన ‘కాంగ్రెస్’ అనే పత్రికను వెలువరించినట్లు చారిత్రక ప్రస్తావన ఉంది. ఇది ఆయన కేవలం కవిగానే కాకుండా, తన కాలపు పత్రికా చైతన్యంతో మమేకమైన వ్యక్తి అని చాటుతుంది. అలాగే 1969లో వెలువడిన చారిత్రాత్మక ‘తిరగబడు’ కవితా సంకలనంలో కూడా ఆయన పేరు ప్రముఖంగా కనిపిస్తుంది.
* మూడు భాషల్లో సాహితీ సాధన..
దేవులపల్లి సుదర్శన్రావు సాహిత్య వ్యక్తిత్వంలో అత్యంత విశిష్టమైన అంశం ఆయన త్రిభాషా ప్రజ్ఞ.
ఆంగ్ల రచనలు: “Dedicated to the Mighty Mother on Mount Helicon The Mother Saraswathi”, “Scribblings”, “Songs on Life” వంటి రచనలు ఆయన ఆంగ్ల కవితా పటిమను లోకానికి చాటాయి. జ్ఞానం, సృజన, సరస్వతీ తత్వం పట్ల ఆయనకు ఉన్న ఆధ్యాత్మిక అనుబంధం వీటిలో స్పష్టంగా వ్యక్తమవుతుంది.
తెలుగు రచనలు: ‘సుదర్శనం’, ‘విశిష్ట కవితా మార్దవం’, ‘సుదర్శనం – కవిత్వావలోకనం’ వంటి రచనలు ఆయన అసాధారణ సాహిత్య ప్రతిభకు నిదర్శనాలుగా నిలిచాయి.
ఆయన ప్రతిభను గుర్తించిన ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు, కోవెల సంపత్కుమారాచార్య, ప్రొఫెసర్ లక్ష్మణమూర్తి, ఆచార్య జె.వి. రాఘవేంద్రరావు వంటి దిగ్గజాలు ఆయన రచనలను ప్రశంసిస్తూ ముందుమాటలు, అభిప్రాయాలు అందించారు.
* కవిత్వంలో తాత్విక దృక్పథం..
సుదర్శన్రావు రచనల్లో చిన్న వాక్యంలో పెద్ద భావాన్ని, గహనమైన తాత్వికతను నిక్షిప్తం చేసే ప్రత్యేక శైలి కనిపిస్తుంది. మనిషి బాహ్య ప్రపంచాన్ని మాత్రమే కాకుండా, అతని అంతరంగాన్ని నిలదీస్తూ ఆయన రాసిన ఈ పంక్తులు ఆయన లోతైన ఆలోచనా విధానానికి అద్దం పడతాయి.
“అద్దం నా అంతర్యాన్ని చూపగలిగి వుంటే…”
సమాజంలోని నటన, మానవ ఆశలు, మరణం, అమరత్వం వంటి అంశాలను ఆయన ఒక తాత్విక వేత్త దృష్టితో పరిశీలించి కవిత్వీకరించారు.
* ఉర్దూ-తెలుగు సాహిత్యానికి బలమైన వారధి..
సుదర్శన్రావు సాహిత్య సేవలో అత్యంత అపురూపమైన అధ్యాయం ఉర్దూ కవిత్వాన్ని తెలుగులోకి అనువదించడం. ప్రజాకవి కాళోజీ నారాయణరావు సోదరుడైన కాళోజీ రామేశ్వరరావు ‘షాద్’ ఉర్దూ కవితలను ఆయన అద్భుతంగా తెలుగులోకి అనువదించారు. అలాగే సూఫీ కవి సయ్యద్ అహ్మద్ హుసేన్ ‘అన్జద్’, ఉర్దూ మహాకవి అసదుల్లా ఖాన్ గాలిబ్ గారి కవితలను తెలుగు పాఠకులకు చేరువ చేశారు.
ఆయన చేసిన అనువాదంలోని భావరేఖలు ఇలా సాగుతాయి:
“కాలమా కడ తెర్చరాదే
కాని కాలం రాకముందే
బతుకు బరువై పోకముందే…”
తెలంగాణ సంస్కృతిలో తెలుగు, ఉర్దూ భాషలు పరస్పరం మిళితమై ఉన్న నేపథ్యంలో ఆయన ఈ అనువాద కృషి ద్వారా రెండు భాషల మధ్య ఒక బలమైన సాహిత్య వారధిగా నిలిచారు.
*పాఠక లోకానికి కనుమరుగైన గొప్ప కవి..
‘పునాస’ త్రైమాసిక తొలి సంచికలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ దేవులపల్లి సుదర్శన్రావుని “పాఠక లోకానికి కనుమరుగైన గొప్ప కవి” అని అభివర్ణించారు. సరైన గ్రంథ ప్రచురణలు అందుబాటులో లేకపోవడం, కాలక్రమేణా పాత పత్రికలు కనుమరుగవడం వంటి కారణాల వల్ల ఎంతో విలువైన సాహిత్యం పాఠకులకు దూరమవుతోందని, అందుకే శతజయంతి వంటి సందర్భాలు కేవలం స్మరణకే పరిమితం కాకుండా పునఃపరిచయానికి వేదిక కావాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
* నిజమైన నివాళి..
కీ.శే. దేవులపల్లి సుదర్శన్రావు గారు 2004 మార్చి 22 న పరమపదించారు. ఆయన శతజయంతి సందర్భంగా ఆయన మూడు భాషల రచనలను, అరుదైన వ్యాసాలను, ఉర్దూ అనువాదాలను సమగ్రంగా సేకరించి మళ్లీ వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత సాహిత్య లోకంపై ఉంది. ఆయన అక్షరాలను కొత్త తరానికి పరిచయం చేయడమే ఆ మహనీయునికి మనం అర్పించే నిజమైన అక్షర నివాళి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
