BC Reservations
BC Reservations: ఆకేరు న్యూస్, హైదరాబాద్: బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. జాతీయ ఓబీసీ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శాసనమండలి పక్షనేత సిరికొండ మధుసూధనాచారి పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో ఓబీసీల కులగణనను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించి, వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని మధుసూధనాచారి డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, అయితే బీసీలకు జనాభా ప్రాతిపదికన న్యాయం జరగాలని అన్నారు.
దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపు
మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. బీసీల హక్కుల సాధన కోసం దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని అన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ ఎల్.రమణ తదితరులు మాట్లాడుతూ.. బీసీల జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. బీసీలకు రాజకీయ, సామాజిక న్యాయం జరిగే వరకు పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ బీసీ సంఘాల రాష్ట్ర స్థాయి నాయకులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
