సీఎస్ సంజయ్ జాజు
* ఎన్ఈహెచ్ఎస్ అమలుపై సీఎస్ సంజయ్ జాజు సమీక్ష
* ఆసుపత్రుల్లో అడ్మిషన్లు నిరాకరించొద్దు
* పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించాలి
Sanjay Jaju| ఆకేరు న్యూస్, హైదరాబాద్: న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (NEHS) అమలులో ఉద్యోగులు, పెన్షనర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఈ పథకం కింద వైద్య సేవలు సజావుగా అందేలా ఆసుపత్రులు, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
శుక్రవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఎన్ఈహెచ్ఎస్ బోర్డు సమావేశంలో ఆయన పథకం అమలుపై సమీక్షించారు. ఉద్యోగ సంఘాల నాయకులు లేవనెత్తిన సమస్యలు, ముఖ్యంగా ఆసుపత్రుల్లో అడ్మిషన్లు, వైద్య చికిత్సలు, బిల్లుల చెల్లింపులపై చర్చించారు.
అడ్మిషన్లు నిరాకరిస్తే చర్యలు
యశోద, అపోలో, కిమ్స్ తదితర కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో ఆన్లైన్లో మాట్లాడిన సీఎస్.. ఉద్యోగ సంఘాలు చేసిన ఫిర్యాదులపై వివరణ కోరారు. ఎన్ఈహెచ్ఎస్ పరిధిలోని రోగులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆసుపత్రుల్లో అడ్మిషన్లు నిరాకరించకూడదని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న పాత బిల్లులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, చికిత్సకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు.
సీజీహెచ్ఎస్ ధరల ఆధారంగా ఛార్జీలు
వైద్య చికిత్సల ధరల్లో పారదర్శకత, ఏకరూపత ఉండాలని సంజయ్ జాజు పేర్కొన్నారు. చికిత్సల ఛార్జీలను క్రమబద్ధీకరించడంతో పాటు జవాబుదారీతనాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. ధరల నిర్ణయంలో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (CGHS) నిర్దేశించిన ధరలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కార్పొరేట్ ఆసుపత్రులు ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలని కోరారు.
ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు బి.ఎం.డి. ఎక్కా, నవీన్ మిట్టల్, ముఖ్య కార్యదర్శులు క్రిస్టినా చోంగ్తు, యోగితా రాణా, శిఖా గోయల్, సర్ఫరాజ్ అహ్మద్, గౌరవ్ ఉప్పల్, శృతి ఓజా, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ, ఇతర ఉన్నతాధికారులు, బోర్డు సభ్యులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

