Nandi Awards 2026
* డిసెంబరులో ప్రదానం..
* ఎన్టీఆర్ అవార్డుకు రూ.5 లక్షలు
Nandi Awards 2026: ఆకేరు న్యూస్, అమరావతి: తెలుగు సినిమా, టెలివిజన్ రంగానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన నంది అవార్డులను పునరుద్ధరించి 2026 డిసెంబరులో ప్రదానం చేయాలని నిర్ణయించినట్లు ఏపీ ఫిల్మ్, టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్ పి. భరత్ భూషణ్ తెలిపారు. ఇప్పటికే ప్రకటించిన 2012–2016 నంది ఫిల్మ్, టీవీ అవార్డులతో పాటు.. 2017 నుంచి 2024 వరకు ప్రతి ఏడాదికి 4 అవార్డుల చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఇందులో రెండు ప్రొడక్షన్, రెండు స్పెషల్ జ్యూరీ అవార్డులు ఉంటాయని చెప్పారు. 2025 సంవత్సరానికి సంబంధించిన అవార్డులను కూడా అందజేస్తామని తెలిపారు.
* అక్టోబరులో కమిటీలు
నంది అవార్డుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించనున్నట్లు భరత్ భూషణ్ తెలిపారు. అక్టోబరులో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి.. నవంబరులో ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, డిసెంబరులో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నట్లు చెప్పారు. నంది ఫిల్మ్, జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలను అమరావతి లేదా విజయవాడలో, నంది టీవీ అవార్డుల కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. చలనచిత్ర విభాగంలో కథా చిత్రాలు, జాతీయ సమైక్యత, బాలల చిత్రాలు, డాక్యుమెంటరీలు, విద్యా విషయక చిత్రాలు, తెలుగు సినిమాపై ఉత్తమ రచన తదితర విభాగాల్లో కలిపి 46 కేటగిరీల్లో అవార్డులు ఇవ్వనున్నారు. విజేతలకు నంది విగ్రహాలు, ప్రశంసాపత్రాలు, నగదు పారితోషికంతో పాటు వివిధ విభాగాల్లో 8 గోల్డ్ మెడల్స్ అందజేయనున్నట్లు తెలిపారు.
* ఎన్టీఆర్ అవార్డుకు రూ.5 లక్షలు
భారతీయ చలనచిత్ర రంగానికి విశేష సేవలు అందించిన ప్రముఖులకు ఇచ్చే జాతీయ చలనచిత్ర అవార్డుల వివరాలను కూడా వెల్లడించారు. ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు గ్రహీతకు రూ.5 లక్షల నగదు, జ్ఞాపిక, సన్మాన పత్రం అందించనున్నారు. బి.ఎన్. రెడ్డి, నాగిరెడ్డి–చక్రపాణి, రఘుపతి వెంకయ్య నేషనల్ ఫిల్మ్ అవార్డుల గ్రహీతలకు రూ.2 లక్షల చొప్పున నగదు పురస్కారం ఇవ్వనున్నట్లు తెలిపారు.
* 48 నంది టీవీ అవార్డులు
టెలివిజన్ రంగంలో మొత్తం 48 నంది అవార్డులను అందించనున్నట్లు భరత్ భూషణ్ చెప్పారు. టెలి చిత్రాలు, టీవీ ఫీచర్స్, మెగా సీరియల్స్, డైలీ సీరియల్స్, డాక్యుమెంటరీలు, సామాజిక, విద్యా విషయక చిత్రాలతో పాటు నటులు, దర్శకులు, స్క్రీన్ప్లే రచయితలు, సాంకేతిక నిపుణుల విభాగాల్లో పురస్కారాలు ఇవ్వనున్నారు. తెలుగు సినిమా, టెలివిజన్ రంగానికి చెందిన కళాకారులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గౌరవించి ప్రోత్సహించడమే నంది అవార్డుల ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
