World Heart Day 2026
*CPRతో ప్రాణాలు కాపాడొచ్చు..
ఆకేరు న్యూస్, హన్మకొండ :వరల్డ్ హార్ట్ డే సందర్భంగా వరంగల్‌లో శ్రీనివాస హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో కమ్యూనిటీ CPR శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ప్రపంచ హార్ట్ ఫెడరేషన్ పిలుపు మేరకు ప్రతి ఏడాది సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డే నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది “డోంట్ మిస్ ఎ బీట్” అనే థీమ్‌తో గుండె జబ్బులను ముందస్తుగా గుర్తించడం, అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడే చర్యలపై అవగాహన కల్పించనున్నారు.
శ్రీనివాస హార్ట్ ఫౌండేషన్ 1999 నుంచి కమ్యూనిటీ కార్డియాలజీ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 2001 నుంచి వరల్డ్ హార్ట్ డే కార్యక్రమాలు, 2009 నుంచి కమ్యూనిటీ CPR శిక్షణ కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో 2026 వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 26వ వార్షిక కార్యక్రమం నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 29న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కాకతీయ మెడికల్ కాలేజీలోని ఎన్ఆర్ఐ పూర్వ విద్యార్థుల విద్యా కేంద్రంలో ఒకరోజు కమ్యూనిటీ CPR శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఇందులో సాధారణ ప్రజలకు అంతర్జాతీయ మార్గదర్శకాల ప్రకారం హై-క్వాలిటీ CPR, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ (AED) వినియోగంపై ఉచిత శిక్షణ అందించనున్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారికి సాఫ్ట్ కాపీ సర్టిఫికేషన్ కూడా అందించనున్నారు.
నేషనల్ CPR ఛాలెంజ్ క్యాంపెయిన్‌లో భాగంగా ఈసారి వివిధ ప్రధాన భారతీయ భాషల్లో కమ్యూనిటీ CPRపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాన్ని రూపొందించారు. అత్యవసర సమయంలో గుండె ఆగిపోయిన వ్యక్తికి ఆసుపత్రికి తరలించేలోపు చుట్టుపక్కల ఉన్నవారు CPR అందించడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశాలను పెంచడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
హాస్పిటల్ వెలుపల సంభవించే కార్డియాక్ అరెస్ట్ ప్రస్తుతం ఒక ముఖ్యమైన ప్రజారోగ్య సమస్యగా మారింది. కార్డియాక్ అరెస్ట్‌ను వేగంగా గుర్తించడం, వెంటనే CPR ప్రారంభించడం, AED ద్వారా త్వరగా డిఫిబ్రిలేషన్ చేయడం, EMS అంబులెన్స్ సేవలు సకాలంలో చేరడం, అనంతరం సరైన వైద్యం అందించడం వంటి చర్యలు బాధితుడి ప్రాణాలు నిలిచే అవకాశాలను మెరుగుపరచడంలో కీలకంగా ఉంటాయి.
అయితే మన దేశంలో కార్డియాక్ అరెస్ట్, CPRపై సాధారణ ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండటంతో పాటు.. హాస్పిటల్ వెలుపల జరిగే కార్డియాక్ అరెస్ట్‌లలో ప్రాణాలతో బయటపడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటున్నాయని నిర్వాహకులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రజలకు విస్తృతంగా CPR శిక్షణ ఇవ్వడంతో పాటు.. ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో AEDలను అందుబాటులో ఉంచడం, EMS అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేయడం, గుండె చికిత్సకు ప్రజల ప్రాప్యతను పెంచడం వంటి చర్యలు అవసరమని పేర్కొన్నారు.
ప్రభుత్వాలు, వైద్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు కలిసి దీర్ఘకాలికంగా CPRపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే.. ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ సమయంలో బైస్టాండర్ CPR అందించే వారి సంఖ్య పెరిగి మరిన్ని ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి IMA తెలంగాణ, తెలంగాణ కార్డియాలజికల్ సొసైటీ, తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్, THANA (తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్), అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా–వరంగల్ చాప్టర్, కాకతీయ మెడికల్ కాలేజ్ అలుమ్ని వెల్ఫేర్ అసోసియేషన్ మద్దతు అందిస్తున్నాయి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.

