Rayaparthy|
Rayaparthy| ఆకేరు న్యూస్, రాయపర్తి: రాయపర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల (GPDP) రూపకల్పనపై మంగళవారం ఒకరోజు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లకు అధికారులు ప్రణాళికల తయారీ విధానం, గ్రామాల అవసరాల గుర్తింపు తదితర అంశాలపై మార్గదర్శనం చేశారు.
మారుతున్న వాతావరణ పరిస్థితులు, రాబోయే ఎల్ నినో ప్రభావంతో తలెత్తే నీటి ఎద్దడి, ఇతర ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు. గ్రామ పంచాయతీల పరిధిలో జల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ‘విబిజి రామ్జీ’ ప్రాజెక్టు ద్వారా ‘జలసిరి’ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు.
జల సంరక్షణకు ప్రాధాన్యం
ఉపాధి హామీ, జలసిరి కార్యక్రమాల కింద ఇంటింటికీ ఇంకుడు గుంతలు, పొలాల్లో పంటకుంటలు, ఊటకుంటల పునరుద్ధరణ, బోర్వెల్ రీచార్జ్ నిర్మాణాలు, ప్రజలు ఎక్కువగా సమకూరే ప్రాంతాల్లో సామూహిక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని సూచించారు. వర్షపు నీటిని సమర్థవంతంగా ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచేలా గ్రామస్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.
మౌలిక వసతులపై దృష్టి
గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులు సూచించారు. గ్రామ పంచాయతీ, వీఓ భవనాలు, గ్రంథాలయాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, నిర్వహణతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, కిచెన్ షెడ్లు, సురక్షితమైన కాంపౌండ్ వాల్స్ వంటి పనులను ప్రణాళికల్లో చేర్చాలని తెలిపారు.
ప్రజల అవసరాలను గుర్తించి, అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి GPDPలను రూపొందించాలని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.
పాల్గొన్న అధికారులు
కార్యక్రమంలో ఎంపీడీఓ పాక శ్రీనివాసులు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ, డీఈ, ఏఈలు, మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాష్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు (EC), టెక్నికల్ అసిస్టెంట్లు (TA), వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
