జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్న జీవన్‌రెడ్డి
* పంట కొనుగోలు చేయాలంటూ సీఐ కాళ్లు మొక్కిన మహిళా రైతు
* రైతులతో కలిసి నిజామాబాద్ జాతీయ రహదారిపై ధర్నా
ఆకేరు న్యూస్, జగిత్యాల: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు రోజుల తరబడి మార్కెట్లలో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల బీట్ బజార్ మార్కెట్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర కల్పించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. బీట్ బజార్ మార్కెట్లో నెలకొన్న ఇబ్బందుల దృష్ట్యా మార్కెట్‌ను చల్గల్కు తరలించాలని ప్రభుత్వాన్ని కోరారు. జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్ మార్కెట్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి, జిల్లా పరిషత్ తొలి చైర్పర్సన్ దావా వసంత సురేష్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్‌కు ధాన్యం తీసుకొచ్చిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు తమ ఇబ్బందులను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. మార్కెట్‌కు ధాన్యం తీసుకొచ్చిన తర్వాత పంటకు సరైన ధర నిర్ణయించడం లేదని, కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజుల తరబడి మార్కెట్లోనే ఉండాల్సి వస్తోందని, ధాన్యం అమ్ముకునేందుకు సరైన వసతులు, స్థలం కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు.
* మార్కెట్లో రైతుల ఆవేదన..
మార్కెట్‌కు ధాన్యం తీసుకొచ్చిన తర్వాత ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే, దానిని అమ్ముకునేందుకు సరైన స్థలం కూడా చూపించకపోతే ఎలా అని ప్రశ్నించారు. ధాన్యం విక్రయించడానికి ఎన్ని రోజులు మార్కెట్లోనే వేచి ఉండాలని నిలదీశారు. పంట కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం వల్ల పెట్టుబడులు, రవాణా ఖర్చులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జీవన్‌రెడ్డి, దావా వసంత సురేష్ రైతులతో కలిసి నిజామాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని, రైతులకు న్యాయమైన ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
* సీఐ కాళ్లు మొక్కిన మహిళా రైతు
మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు రైతుల ఆవేదనను మరోసారి బయటపెట్టాయి. తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ ఓ మహిళా రైతు పోలీసు సీఐ కాళ్లు మొక్కడం అక్కడి పరిస్థితులకు అద్దం పట్టింది. పంటను అమ్ముకునేందుకు రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని, తమ సమస్యను పరిష్కరించాలని ఆమె వేడుకున్నారు. ఈ ఘటన అక్కడున్న రైతులు, నాయకులను కలచివేసింది.

* ఉచిత బస్సు ప్రయాణంపై మహిళా రైతుల అసహనం
ఈ సందర్భంగా కొందరు మహిళా రైతులు ప్రభుత్వంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాము నెలకు ఒక్కసారి కూడా ఎక్కడికీ వెళ్లడం లేదని, తమకు అవసరమైనది ఉచిత బస్సు ప్రయాణం కాదని, కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర అని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించకుండా ఇతర పథకాల గురించి ప్రచారం చేయడం వల్ల తమకు ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.
* చల్గల్కు మార్కెట్ తరలించాలని డిమాండ్
జగిత్యాల బీట్ బజార్ మార్కెట్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మార్కెట్‌ను చల్గల్కు తరలించాలని జీవన్‌రెడ్డి, దావా వసంత సురేష్ డిమాండ్ చేశారు. రైతులకు సరిపడా స్థలం, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు పండించిన పంటను విక్రయించుకునేందుకు రోజుల తరబడి ఇబ్బందులు పడే పరిస్థితి ఉండకూడదని, కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకత పాటించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయడంతోపాటు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

