Mahabubnagar
* భూ సమస్య పరిష్కారం కాలేదని మనస్తాపం.
Mahabubnagar| ఆకేరు న్యూస్, మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కార్యాలయ ప్రాంగణంలోని చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కోయిలకొండ మండలం పారుపల్లి గ్రామానికి చెందిన లవప్ప (53)కు వంశపారంపర్యంగా 19 ఎకరాల భూమి ఉండాల్సి ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం తన ఆధీనంలో 18 ఎకరాలు మాత్రమే ఉన్నాయని, మరో ఎకరం పొరుగు రైతుల భూమిలో ఉందని లవప్ప అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
తనకు రావాల్సిన భూమిని గుర్తించి సమస్యను పరిష్కరించాలని లవప్ప పలుమార్లు రెవెన్యూ అధికారులను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే సమస్య కొలిక్కి రాకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం కోయిలకొండ ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చిన లవప్ప.. కార్యాలయ ఆవరణలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఘటనపై వివరాలు సేకరించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లవప్ప భూ సమస్యకు సంబంధించిన పత్రాలు, ఆయన గతంలో అధికారులకు చేసిన ఫిర్యాదులు, సమస్య పరిష్కారానికి జరిగిన ప్రయత్నాలపై పోలీసులు, రెవెన్యూ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
