Balmoor Venkat
* పాల వ్యాపారంపై నిలదీత!
* ఎల్లమ్మ తల్లి సాక్షిగా నిజాలు చెప్పాలి..
* ఆంధ్రా విద్యాసంస్థల వ్యవహారంపై ప్రశ్నలు
ఆకేరు న్యూస్, సిద్దిపేట: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావుపై తెలంగాణ ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట సభలో చేసిన ఆరోపణలపై హరీశ్ రావు మౌనం వీడి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎల్లమ్మ తల్లి సాక్షిగా వాస్తవాలను వెల్లడించాలని సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన విద్యాసంస్థలపై విమర్శలు చేసిన హరీశ్ రావు.. ఇప్పుడు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తులతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నారంటూ ఆరోపించారు. ముఖ్యంగా పాల వ్యాపారానికి సంబంధించిన అంశాలపై స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించారు.
ఆంధ్రా విద్యాసంస్థల పేరుతో బెదిరింపులా?
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రా విద్యాసంస్థలను రాష్ట్రం నుంచి వెళ్లగొడతామని బెదిరించి, బ్లాక్మెయిల్ (Blackmail) ద్వారా వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయని బల్మూర్ వెంకట్ పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో ఒక విధంగా మాట్లాడిన హరీశ్ రావు.. ఇప్పుడు అదే ప్రాంతానికి చెందిన వారితో వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నారంటూ విమర్శించారు. ఈ వ్యవహారాలకు సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.
సీఎం సభతో బీఆర్ఎస్లోనూ సంతోషం!
సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సభ కాంగ్రెస్ శ్రేణుల్లోనే కాకుండా బీఆర్ఎస్లోని కొందరు నాయకుల్లోనూ సంతోషాన్ని కలిగించిందని బల్మూర్ వెంకట్ వ్యాఖ్యానించారు. హరీశ్ రావు వ్యవహారశైలిపై సొంత పార్టీలోనే అసంతృప్తి ఉందని పరోక్షంగా విమర్శించారు. బీజేపీ నేతలతో హరీశ్ రావుకు లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయనే అంశంపై కూడా ప్రశ్నలు సంధించారు. ఈ ఆరోపణలపై ఆయన స్పష్టత ఇవ్వాలని కోరారు.
కవిత బాటలోనే హరీశ్ రావు?
బీఆర్ఎస్లో హరీశ్ రావు రాజకీయ భవిష్యత్తుపై బల్మూర్ వెంకట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కవిత విషయంలో చోటుచేసుకున్న పరిణామాల మాదిరిగానే భవిష్యత్తులో హరీశ్ రావుకు కూడా పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకావచ్చని అన్నారు. సిద్దిపేటలో ఆయన అనుచరులు, కార్యకర్తలు సైతం పూర్తిస్థాయిలో విశ్వసించడం లేదంటూ విమర్శించారు.
ప్రమాదంపై తప్పుడు పోస్టులు పెట్టించారని ఆరోపణ
తన కుటుంబం ప్రమాదానికి గురైన సమయంలో బీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియా (Social Media) ఖాతాల ద్వారా తప్పుడు పోస్టులు ప్రచారం చేయించారని బల్మూర్ వెంకట్ ఆరోపించారు. ఈ వ్యవహారం కేటీఆర్ అనుసరిస్తున్న రాజకీయ సంస్కృతికి నిదర్శనమని విమర్శించారు. ఒక ప్రజాప్రతినిధి కుటుంబం ప్రమాదానికి గురైనప్పుడు మానవత్వంతో స్పందించాల్సింది పోయి, ప్రమాదంపై అవహేళన చేసేలా పోస్టులు పెట్టించడం సరికాదని మండిపడ్డారు.
రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే అయినప్పటికీ వ్యక్తిగత ప్రమాదాలు, కుటుంబ సభ్యుల భద్రత వంటి సున్నితమైన అంశాల్లో కనీస మానవత్వం పాటించాలని హితవు పలికారు. రాజకీయ ప్రత్యర్థులకు కష్టాలు ఎదురైనప్పుడు సానుభూతి చూపించాలే తప్ప అవహేళన చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు.
చీకటి వ్యవహారాలను బయటపెడుతూనే ఉంటా
దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నానని, హరీశ్ రావుకు సంబంధించి తాను ప్రస్తావిస్తున్న ఆరోపణలు, వ్యవహారాలను ప్రజల ముందు వెల్లడిస్తూనే ఉంటానని బల్మూర్ వెంకట్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై హరీశ్ రావు మౌనం వీడి సమాధానం చెప్పాలని, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు.
Also Read: ఆహాలో ‘క్రేజీ కల్యాణం’..

Please tell us what is wrong. Your report will be sent to the website team.

