Ramappa Temple
* ఓపెన్‌కాస్ట్ గనిపై కేటీఆర్ అభ్యంతరం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో ప్రతిపాదించిన పి.వి. నరసింహారావు ఓపెన్‌కాస్ట్ బొగ్గు గని వ్యవహారం రాజకీయంగా, పర్యావరణపరంగా చర్చనీయాంశంగా మారింది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, రామప్ప చెరువుపై మైనింగ్ ప్రభావం పడే అవకాశం ఉందంటూ వారసత్వ పరిరక్షణ సంస్థలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
గనిని రద్దు చేయాలి
రామప్ప సమీపంలో ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌కు అనుమతి ఇవ్వొద్దని కేటీఆర్ డిమాండ్ చేశారు. మైనింగ్ కోసం భారీ స్థాయిలో తవ్వకాలు, బ్లాస్టింగ్ చేపడితే చారిత్రక ఆలయానికి, రామప్ప చెరువుకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
నిపుణుల ఆందోళన
ప్రతిపాదిత గనిలో లోతైన తవ్వకాలు చేపట్టాల్సి ఉండటంతో భూగర్భ జలాల ప్రవాహం, ప్రాంతంలోని భౌగోళిక నిర్మాణంపై ప్రభావం ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. సుమారు 300 మీటర్ల వరకు తవ్వకాలు జరగవచ్చన్న నేపథ్యంలో స్వతంత్ర శాస్త్రీయ, పర్యావరణ, హైడ్రోజియోలాజికల్ అధ్యయనాలు నిర్వహించాలని వారసత్వ పరిరక్షణ సంస్థలు కోరుతున్నాయి.
రామప్పకు ప్రత్యేక ప్రాధాన్యం
పాలంపేటలోని కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆలయానికి 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా లభించింది. ఆలయ నిర్మాణంలో ప్రత్యేకమైన శాండ్బాక్స్ సాంకేతికతను ఉపయోగించినట్లు కేటాయా హెరిటేజ్ ట్రస్ట్ పేర్కొంది. ఆలయంతో పాటు చారిత్రక రామప్ప చెరువు కూడా ఈ ప్రాంత వారసత్వ, పర్యావరణ వ్యవస్థలో కీలక భాగంగా ఉంది.
నిర్ణయం శాస్త్రీయ అధ్యయనాల తర్వాతే
ఇదిలా ఉండగా, రామప్ప పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని ములుగు జిల్లా కలెక్టర్ గతంలో స్పష్టం చేశారు. మైనింగ్‌కు సంబంధించిన తదుపరి నిర్ణయం సమగ్ర శాస్త్రీయ అధ్యయనాలు, పర్యావరణ ప్రభావం, భద్రతా అంశాలను పరిశీలించిన తర్వాతే తీసుకుంటామని తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
