District Collector Bhorkhade Hemant Sahadeorao
Mulugu Collector| ఆకేరు న్యూస్, ములుగు: బాలసదనంలో ఆశ్రయం పొందుతున్న చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు మెరుగైన వసతులు కల్పించాలని ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు.
జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహం ఎదురుగా ఉన్న బాలసదనాన్ని సోమవారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి బాలికలకు అందుతున్న వసతులు, ఆహారం, విద్య, ఆరోగ్యం, సంరక్షణకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
బాలసదనంలో చేరే బాలికల పరిస్థితులు, ప్రవేశ ప్రక్రియ, వారికి అందిస్తున్న సేవలపై అధికారులు కలెక్టర్కు వివరించారు. తల్లిదండ్రులు లేని బాలికలు, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన వారు, కుటుంబ పరిస్థితుల కారణంగా సరైన సంరక్షణకు, విద్యకు దూరమయ్యే అవకాశమున్న బాలికలకు బాలసదనంలో ఆశ్రయం కల్పిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్, జిల్లా మిషన్ సమన్వయకర్త రమాదేవి, బాలల సహాయ సమన్వయకర్త నరేష్, బాలసదనం పర్యవేక్షకురాలు శ్యామలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
