Vetri Payanam Scheme
ఆకేరు న్యూస్, చెన్నై: తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వెట్రి పయనం పై దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు ముగించింది. పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిలిపివేయాలని కోరిన ప్రైవేట్ బస్సు ఆపరేటర్ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు ధర్మాసనం అనుమతించింది.
తమిళనాడు ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ఈ పథకం సుమారు 12,695 ప్రభుత్వ బస్సులకు వర్తిస్తోంది. గతంలో అమలైన విడియల్ పయనం పథకానికి ఇది విస్తరణగా తీసుకొచ్చారు. ఉచిత ప్రయాణానికి సంబంధించిన ఖర్చుల కోసం ప్రభుత్వ రవాణా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు రూ.6,000 కోట్లు కేటాయిస్తున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు.
* ప్రైవేట్ బస్సులపై ప్రభావం
ఈరోడ్ జిల్లాకు చెందిన ప్రైవేట్ బస్సు ఆపరేటర్ ఎన్. కలామణి హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ప్రైవేట్ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గుతోందని ఆయన వాదించారు. దీనివల్ల ప్రైవేట్ బస్సు నిర్వాహకులు ఆర్థికంగా నష్టపోతున్నారని, తమ వ్యాపారాలను కొనసాగించడం కష్టంగా మారుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వ బస్సులకు అందిస్తున్న పరిహారం తరహాలో ప్రైవేట్ బస్సు ఆపరేటర్లకు కూడా పరిహారం ఇవ్వాలని లేదా పథకాన్ని తమ బస్సులకు వర్తింపజేయాలని కోరినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వ బస్సులకు మాత్రమే ఈ ప్రయోజనం కల్పించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని వాదించారు.
* రాష్ట్రవ్యాప్త స్టేపై కోర్టు ప్రశ్న
పిటిషన్ విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ. ధర్మాధికారి, న్యాయమూర్తి జి. అరుల్ మురుగన్‌తో కూడిన డివిజన్ బెంచ్ కీలక ప్రశ్నలు లేవనెత్తింది. ఒక జిల్లాకు చెందిన ప్రైవేట్ బస్సు ఆపరేటర్ రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న పథకాన్ని నిలిపివేయాలని ఎలా కోరగలరని ధర్మాసనం ప్రశ్నించింది. సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వును ప్రత్యేకంగా సవాలు చేసే అవకాశం ఉందని కోర్టు సూచించింది. ప్రస్తుత పిటిషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పథకంపై నిషేధం విధించాలని కోరడం సాధ్యం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
* పిటిషన్ ఉపసంహరణ
కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో పిటిషనర్ తరఫు న్యాయవాదులు కేసును ఉపసంహరించుకునేందుకు అనుమతి కోరారు. అందుకు ధర్మాసనం అనుమతించడంతో పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లుగా పరిగణించి కేసును కొట్టివేసింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
