SIR Allegations BJP Kamalapur
* కాంగ్రెస్‌పై కమలాపూర్ బీజేపీ ఫైర్
ఆకేరు న్యూస్ , కమలాపూర్ : దేశంలో ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియ పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఓట్ల చోరీ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆ పార్టీ ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని బీజేపీ మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్, కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్ ధ్వజమెత్తారు. ఆదివారం కమలాపూర్ లోని కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ మాట్లాడుతూ, ఓటర్ల జాబితాల సవరణ అనేది కొత్తగా ప్రవేశపెట్టిన విధానం కాదని, 1959 నుంచి 2004 వరకు కాంగ్రెస్ హయాంలో దాదాపు 8 సార్లు జరిగిందని అన్నారు. అప్పుడు లేని ఓట్ల చోరీ ఇప్పుడు బీజేపీ హయాంలో జరుగుతోందంటూ తప్పుడు ప్రచారాలు చేయడం హాస్యాస్పదమన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న 9 లక్షల పోలింగ్ బూత్‌లకు గాను అన్ని రాజకీయ పార్టీల నుంచి సుమారు 35 లక్షల మంది బూత్ స్థాయి ఏజెంట్లు (BLA-2) క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లతో సంప్రదింపులు జరిపి ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యారని స్పష్టం చేశారు.
అందరి సమక్షంలో, పూర్తి పారదర్శకంగా జరిగిన ఈ ప్రక్రియను తప్పుపట్టడం సమంజసం కాదన్నారు. ఫారం-7 ద్వారా తొలగించిన సుమారు 29 లక్షల ఓట్లు అన్నీ కూడా అన్ని పార్టీల బిఎల్ఎ-2 ల సమక్షంలో పరిశీలించి నిర్ధారించినవేనని స్పష్టం చేశారు.
ఈ ప్రక్రియను సుప్రీంకోర్టుతో పాటు 42 మంది విశ్రాంత న్యాయమూర్తులు, పలువురు మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా సమర్థించారని తెలిపారు. ఒకవేళ ఎవరి ఓటైనా తొలగిపోయి ఉంటే, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఫారం-6 ద్వారా మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు పూర్తి అవకాశం ఉందని గుర్తుచేశారు.
*ఎన్నికల సంఘంపై విమర్శలా : సర్పంచ్ పబ్బు సతీష్
దేశవ్యాప్తంగా బిజెపి పార్టీకి ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక, ఎదుర్కొనే సత్తా లేక, రాజ్యాంగబద్ధమైన సంస్థలను అప్రతిష్టపాలు చేస్తూ, దేశంలో అస్థిరతను సృష్టించడానికి కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వైఖరి ప్రజాస్వామ్యాన్ని లేదా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను గౌరవించినట్టుగా లేవని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ తీరును ప్రజలందరూ గమనిస్తున్నారని, సరైన సమయంలో ఆ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధ సంస్థలని గౌరవించాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి ప్రధాన కార్యదర్శులు జెట్టి సారంగపాణి, భూపతి ప్రవీణ్, మండల ఉపాధ్యక్షులు ఇనుగాల రత్నాకర్, పెండ్యాల ప్రభాకర్ రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షులు పెండ్యాల తిరుపతి రెడ్డి, ఎస్సీ మోర్చా అధ్యక్షులు జేరి పోతుల రాజేందర్, సీనియర్ నాయకులు తుమ్మ శోభన్, బాబు, బండి కోటేశ్వర, రాజ్ మహ్మద్, మౌటమ్ బాబు, బుర్ర కరుణాకర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
Please tell us what is wrong. Your report will be sent to the website team.

