Murder Case Investigation
* సమావేశంలో ఒకలా.. ప్రెస్ నోట్ లో మరోలా
* వ్యాపారి హత్య కేసు వివరాలు వెల్లడించిన పోలీసులు
ఆకేరు న్యూస్, నెట్వర్క్ : గుండ్లపోచంపల్లికి చెందిన మార్వాడీ నేమారాం చౌదరి హత్య కేసును పేట్ బషీరాబాద్ పోలీసులు ఛేదించి, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈమేరకు విలేకరుల సమావేశంలో మేడ్చల్ ఏసీపీ శంకర్‌రెడ్డి, సీఐలు శ్రీధర్‌రెడ్డి, నర్సింహారావు, అజయ్‌కుమార్‌లు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఎల్బీనగర్లో లైట్ల దుకాణం నిర్వహించే నేమారాం చౌదరి వద్ద ఎ1 సయ్యద్ ఉజ్జమాన్ ఖాస్మీ గతంలో బంగారం, వెండి వ్యాపారం పేరుతో రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టాడు.
అయితే పెట్టుబడి నష్టపోయామని చెప్పి డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో వివాదం నడుస్తోంది. ఉజ్జమాన్ ఖాస్మీ తన కుమార్తె వివాహం ఉందని నమ్మించి, రూ.25 లక్షలు అవసరమని కోరడంతో ఈనెల 2న నేమారాం ఆ మొత్తంతో అల్వాల్ బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు.
ఏ1 తన చేతులకు గ్లౌజులు ధరించి నేమారాంను కదలకుండా పట్టుకున్నాడు. ఎ2 ఒక వస్త్రంతో గొంతుకు బిగించి హత్య చేసినట్లు తెలిపారు. తదనంతరం సెల్‌పోన్‌ను స్విఛాఫ్ చేసి శామీర్‌పేట చెరువులో పడేశారు.
* అప్పు తీర్చుకున్న నిందితుడు..
సహకరించిన హమద్‌కు రూ.5 లక్షల బేరం కుదుర్చుకుని, ముందస్తుగా రూ.80 వేలు ఇచ్చాడు. ఎ1 తీసుకున్న నగదులో రూ.5 లక్షలను ఓ బ్యాంకులో అప్పు చెల్లించుకున్నాడు. మిగతా డబ్బులను ఇంట్లో పెట్టినట్లు తెలుపగా ఇంటికి వెళితే కుటుంబమంతా తాళం వేసి పరారీలో ఉన్నారు.
పోలీసులు 8 ప్రత్యేక బృందాలతో సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేసి, ఈనెల 10న మేడ్చల్ ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి నగదు, ఆటో, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అయితే.. పోలీసులు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో ఈ హత్య క్షుద్రపూజల పేరుతో జరిగినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఈ ప్రస్తావన రాలేదు. దీంతో ఈ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమా? క్షుద్రపూజలా అనే చర్చ జరుగుతోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

