Justice Surya Kant
* హక్కులకు భంగం కలిగితే జోక్యం తప్పదు
* సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, డెస్క్ : జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) 33వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakanth) ముఖ్య అతిథిగా పాల్గొని మానవ హక్కుల పరిరక్షణపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
సమాజంలో ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే న్యాయస్థానాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మౌనంగా ఉండవని, కచ్చితంగా జోక్యం చేసుకుంటాయని ఆయన స్పష్టం చేశారు. బాధితులకు సకాలంలో అండగా నిలవడం ద్వారానే హక్కుల పరిరక్షణ సంస్థలపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
* గొంతు వినిపించలేని వర్గాలపై ప్రత్యేక దృష్టి
ఈ సందర్భంగా వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించి ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవాలని జస్టిస్ సూర్యకాంత్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా సమాజంలో తమ గొంతు వినిపించలేని బలహీన, అట్టడుగు వర్గాల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు. హక్కుల ఉల్లంఘన ఘటనలపై నిరంతర దర్యాప్తు జరగాలని, అప్పుడే బాధితులకు సరైన న్యాయం అందుతుందని జస్టిస్ సూర్యకాంత్ హితవు పలికారు.
రాజ్యాంగం ప్రతి పౌరుడికీ గౌరవం, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయాన్ని హామీ ఇస్తుంది. ఆ హామీలు ప్రజల రోజువారీ జీవితంలో అమలుకావాలి. రాజ్యాంగ హక్కులకు భంగం వాటిల్లినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలి. మానవ హక్కుల కమిషన్లు ఫిర్యాదులను విచారించి, వ్యవస్థలోని లోపాలను గుర్తించి, సాధారణంగా వెలుగులోకి రాని సమస్యలను సంబంధిత సంస్థల దృష్టికి తీసుకురావాలన్నారు.
మానవ హక్కులు వ్యక్తి గౌరవంతో ముడిపడి ఉంటాయి. ఆరోగ్యం, ఆహారం, నివాసం, జీవనోపాధి, పరిశుభ్రమైన పర్యావరణం కూడా వాటిలో భాగమే. కస్టడీలో చిత్రహింసలు, మరణాలు, వెట్టిచాకిరీ, పారిశ్రామిక దోపిడీ వంటి ఘటనల్లో కమిషన్ జోక్యం ప్రాధాన్యం కలిగి ఉంది. పౌరులు ఫిర్యాదులు సమర్పించేందుకు, వాటి పురోగతిని తెలుసుకునేందుకు ఎన్హెచ్ఆర్సీ మొబైల్ యాప్ ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
* నల్లా ఏర్పాటు చేస్తేనే సరిపోదు
ఇంటికి కుళాయి ఏర్పాటు చేయడంతోనే నీటిని అందించినట్లు భావించలేమని, అందులో క్రమం తప్పకుండా సురక్షితమైన నీరు రావాలని వివరించారు. ఆర్సెనిక్, ఫ్లోరైడ్ వంటి హానికర పదార్థాలతో కలుషితమైన నీరు ప్రజల ప్రాణాలకు, ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుందని పేర్కొన్నారు. నీటి లభ్యత ఆరోగ్యం, విద్య, కుటుంబ జీవనం, వ్యక్తి గౌరవాన్ని ప్రభావితం చేస్తుందని జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు.
ప్రభుత్వాలు నీటి సరఫరా వ్యవస్థలను నిర్మించి, నిర్వహించాలి. భూగర్భ జలాలను ఖాళీ చేయడం, నదులను కలుషితం చేయడం, తాగునీటి వనరులను దెబ్బతీయడం భవిష్యత్ తరాలను ప్రభావితం చేస్తుంది. అందువల్ల నీటి హక్కును ప్రస్తుత అవసరంతోపాటు భావితరాల పట్ల బాధ్యతగా చూడాలని సూచించారు. న్యాయస్థానాలను సులభంగా ఆశ్రయించలేని అట్టడుగు వర్గాలు, విచారణ ఖైదీలు, వలస కార్మికులు, వృద్ధులు, దివ్యాంగులు, మహిళల హక్కుల పరిరక్షణలో కమిషన్ పాత్ర క్రియాశీలకంగా ఉండాలన్నారు..

Please tell us what is wrong. Your report will be sent to the website team.

