Mulugu| ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో ప్రీ ప్రైమరీ పాఠశాలల కోసం ఎంపికైన 76 మంది టీచర్లు, ఆయాలకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని జంపాల రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంపిక ప్రక్రియ పూర్తయినప్పటికీ నియామక ఉత్తర్వులు జారీ చేయడంలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు.
సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ప్రీ ప్రైమరీ పాఠశాలల టీచర్లు, ఆయాల సమావేశం కె. అంకిత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జంపాల రవీందర్ మాట్లాడుతూ.. చిన్నారులను ప్రాథమిక విద్య వైపు మళ్లించేందుకు పాఠశాలల ప్రాంగణాల్లో ప్రీ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేసి టీచర్లు, ఆయాలను ఎంపిక చేశారని తెలిపారు. అయితే ఇప్పటివరకు పూర్తిస్థాయిలో నియామకాలు చేపట్టకపోవడంతో ఎంపికైన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
కనీస వేతనాలు అమలు చేయాలి
ఉద్యోగ నియామకాల సమయంలోనే సిబ్బంది సేవలు నిరంతరంగా కొనసాగేలా స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని జంపాల రవీందర్ కోరారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతనాలను ప్రభుత్వమే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని, కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ప్రాతిపదికన నియమితులయ్యే సిబ్బందికి కూడా ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ములుగు జిల్లాలో ఎంపికైన 76 మంది టీచర్లు, ఆయాలకు వెంటనే నియామక పత్రాలు అందించి విధుల్లోకి తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
ఏఐటీయూసీ నూతన కమిటీ ఎన్నిక
సమావేశం అనంతరం ఏఐటీయూసీ ప్రీ ప్రైమరీ పాఠశాలల టీచర్లు, ఆయాల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా సౌలం రమాదేవి, ప్రధాన కార్యదర్శిగా కల్లెబోయిన అంకిత, కోశాధికారిగా సయ్యద్ సోనీ ఎంపికయ్యారు. ఉపాధ్యక్షురాలిగా ధరావత్ గౌతమి, సహాయ కార్యదర్శిగా కొయ్యడ మౌనిక ఎన్నికయ్యారు.
ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ముత్యాల రాజుతో పాటు ప్రీ ప్రైమరీ పాఠశాలల టీచర్లు, ఆయాలు గౌతమి, సోనీ, ప్రియాంక, కాంత, అంకిత, రమాదేవి, సునీత, మమత, తరుణ్, సమ్మక్క, సరిత, మాధవి, మౌనిక, శివరాణి, నిర్మల, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

