పంజాబ్ ను చుట్టేసిన డ్రగ్స్ మాఫియా ( AI Generated Image )
డ్రగ్స్ విష వలయంలో పంజాబ్..
* డ్రగ్స్ అమ్మకాలు అడ్డుకున్నందుకు పర్విందర్ సింగ్‌పై తూటాల వర్షం
* న్యాయం కోసం ఐదు రోజులుగా పర్విందర్ అంత్యక్రియలు నిలిపివేసిన కుటుంబం
* నల్లమందు నుంచి హెరాయిన్ వరకు విస్తరించిన సంక్షోభం
* సరిహద్దుల్లో డ్రోన్లు.. గ్రామాల్లో డ్రగ్స్ అమ్మకాల నెట్ వర్క్
* బిడ్డలను కాపాడుకునేందుకు మహిళల పహారా
* జోటా హత్యపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరిన కేంద్రం
(చిలుముల్ల సుధాకర్)
ఆకేరు న్యూస్, ప్రత్యేక కథనం:
దేశానికి వీర సైనికులను అందించిన నేల.
స్వాతంత్య్ర పోరాటంలో అసమాన త్యాగాలు చేసిన ప్రాంతం.
పాడిపంటలతో దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం. అదే పంజాబ్ ..
ఇపుడు తమ సొంత బిడ్డల భవిష్యత్తు పట్ల ఆందోళన మొదలైంది ..
పంజాబ్‌లో ఇప్పుడు అనేక కుటుంబాలు తమ బిడ్డలను మత్తు నుంచి కాపాడుకునేందుకు పోరాడుతున్నాయి. కొన్ని గ్రామాల్లో మహిళలు కమిటీలుగా ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. అనుమానిత విక్రయాలను ప్రశ్నిస్తున్నారు. చికిత్స అవసరమైన వారిని ఆసుపత్రులకు తీసుకెళ్తున్నారు. మత్తుపై పోరాటం అక్కడ కుటుంబాల మనుగడతో ముడిపడింది. ఈ నేపథ్యంలో మాన్సాలో మాదకద్రవ్యాల వ్యతిరేక కార్యకర్త పర్విందర్ సింగ్ జోటా హత్య తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. అక్టోబరు 13న మందుల దుకాణం వద్ద అక్రమ మత్తు పదార్థాల విక్రయాలపై ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమంలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సమయంలో ఆయనపై కాల్పులు జరిగాయి. దుకాణ యజమాని అశ్విని కుమార్ ఈ కేసులో ప్రధాన నిందితుడు. మత్తు నుంచి బయటపడి ఇతరులను కాపాడేందుకు ఉద్యమించిన వ్యక్తి అదే పోరాటంలో ప్రాణాలు కోల్పోవడం పంజాబ్‌ను కుదిపేసింది.

* న్యాయం కోసం నిలిచిపోయిన అంతిమయాత్ర
ఈ నెల 13న పర్విందర్ సింగ్ జోటాను డ్రగ్స్ మాఫియా దారుణంగా కాల్చి చంపింది. తమ కు న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు నిర్వహించబోమని ప్రకటించింది. గత ఐదు రోజులుగా జోటా మృతదేహం మాన్సా సివిల్ ఆసుపత్రి మార్చురీలోనే ఉందని కుటుంబం సభ్యులు చెబుతున్నారు. హత్యపై సీబీఐ దర్యాప్తు, పీజీఐ వైద్యుల బృందంతో పోస్టుమార్టం వంటి డిమాండ్లతో మాన్సాలో నిరసన కొనసాగుతోంది. కాగా హత్య కేసులో పరారైన అశ్విని కుమార్‌ను రాజస్థాన్‌లోని సాలాసర్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన అనంతరం ఆగ్రహించిన గుంపు ఆయన మందుల దుకాణాన్ని ధ్వంసం చేసి నిప్పుపెట్టింది. మరోవైపు అనధికార నిర్మాణమని పేర్కొంటూ అధికారులు ఆయన ఇంటిలో కొంతభాగాన్ని బుల్డోజర్తో కూల్చివేశారు. హత్యకు సంబందించి విధుల్లో నిర్లక్ష్యంపై ఆరోపణలు రావడంతో మాన్సా సిటీ–2 స్టేషన్ ఎస్‌హెచ్‌వో బియాంత్ కౌర్‌ను సస్పెండ్ చేశారు. . దుకాణం లైసెన్సు నీలమ్ రాణీ పేరుతో ఉండడం వల్ల నిందితుడి భార్య నీలమ్ రాణీతోపాటు మరో వ్యక్తిపైనా కేసు నమోదు చేశారు

* మత్తును గెలిచి.. పర్విందర్ సింగ్ స్పూర్తిదాయక జీవితం
మాజీ సైనికుడు భీమ్‌సింగ్ కుమారుడైన పర్విందర్ సింగ్ జోటా యువకుడిగా క్రికెట్, బాక్సింగ్‌పై ఆసక్తి ఉండేది.
జోటాకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. జలంధర్‌లో కళాశాల చదువుల సమయంలో మత్తుకు అలవాటుపడినట్లు ఆయన సన్నిహితులు వివరించారు. ఆ కాలంలో ఆయన అనేక రకాల సమస్యలను ఎదుర్కొన్నారు . అనంతరం ఆ స్థితి నుంచి బయటపడి తన లాగా పంజాబ్ యువత ప్రభావానికి లోకు కాకూడదని భావించి మత్తు వ్యతిరేక పోరాటం మొదలు పెట్టారు. డ్రగ్స్ ఎక్కడైనా అమ్ముతున్నట్లు సమాచారం వస్తే చాలు అక్కడ తమ టీంతో వాలిపోయేవాడు.. సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ప్రశ్నించేవాడు. దీంతో ప్రజల్లో తక్కువ సమయంలో పెద్ద ఎత్తున గుర్తింపు లభించింది. పర్విందర్ సింగ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అశ్విని కుమార్ ను కూడా ఇదే పద్దతిలో ప్రశ్నించాడు. 2023లో అశ్విని కుమార్ అక్రమంగా మత్తు కలిగించే ఔషధాలు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ చెప్పుల దండతో ఊరేగించాడు. ఈ ఘటనలో జోటాపై కేసు కూడా నమోదయింది. మత్తు విక్రయాలను ప్రశ్నించినందుకే తన కుమారుడిని హత్య చేశారని భీమ్‌సింగ్ ఆరోపిస్తున్నారు. హత్య వెనుక ఇతరుల పాత్ర, డ్రగ్స్ మాఫియా హస్తం ఉందని ఆరోపిస్తూ సీబీఐ విచారణకు భీమ్ సింగ్ డిమాండ్ చేస్తున్నారు.
* పంజాబ్ మత్తు పై బ్రిటీష్ పార్లమెంట్లో చర్చ
పంజాబ్‌లో మత్తు పదార్థాల వినియోగానికి సుదీర్ఘ నేపథ్యం ఉంది. 1906 డిసెంబరు 10న బ్రిటిష్ పార్లమెంటులో జరిగిన ప్రశ్నోత్తరాలే ఇందుకు ఒక ఆధారం. పంజాబ్‌లో 1903–04లో 9,059 ఎకరాలు, 1904–05లో 5,970 ఎకరాల్లో గసగసాల పంట సాగైనట్లు సభ్యుడు హెన్రీ కాటన్ తన ప్రశ్నలో ప్రస్తావించారు.
కొన్ని జిల్లాల్లో నిబంధనలతో సాగును చాలాకాలంగా అనుమతిస్తున్నామని, ఉత్పత్తిని పంజాబ్ ఎక్సైజ్ శాఖ వినియోగిస్తోందని అప్పటి భారత వ్యవహారాల కార్యదర్శి జాన్ మోర్లీ సమాధానమిచ్చారు. కాలక్రమంలో నల్లమందుతోపాటు గసగసాల కాయపొట్టు , స్థానికంగా లభించే భుక్కీ, డోడా పోస్ట్‌గా పిలిచే పదార్థం విరివిగా వాడుకలో ఉండేది పంజాబ్‌కు పొరుగునున్న రాజస్థాన్‌లో అనుమతిపత్రాలపై కాయపొట్టు విక్రయించే దుకాణాలు ఉండేవి. పంజాబ్ నుంచి వినియోగదారులు అక్కడికి వెళ్లేవారని చెబుతుంటారు. 2016 ఏప్రిల్‌లో ఆ అమ్మకాల వ్యవస్థ పై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాయి . దీంతో ఆ వ్యవస్థ మూతపడింది. దాంతో డ్రగ్స్ మాఫియా ఇతర దారులను వెతికింది . అందుబాటులో ఉన్న పదార్థాలు, సరఫరా మార్గాలు, అక్రమ లాభాలు, స్థానిక విక్రయ వ్యవస్థలు కలిసి సంక్షోభాన్ని విస్తరించాయి.
* పాకిస్తాన్ సరిహద్దు .. పంజాబ్ ప్రజలకు మత్తు శాపం
పంజాబ్ సంక్షోభంలో సరిహద్దు భద్రత కీలక అంశంగా మారింది. పాకిస్థాన్ వైపు నుంచి మత్తు పదార్థాల రవాణాకు డ్రోన్ల వినియోగం, వాటిని ఎదుర్కొనే చర్యల గురించి కేంద్ర హోంశాఖ పార్లమెంటుకు వివరించింది. పంజాబ్ సరిహద్దులో డ్రోన్లను అడ్డుకునే వ్యవస్థలను మోహరించినట్లు తెలిపింది. అంటే సరిహద్దుకు ఆవల నుంచి ఎంతటి మత్తు ప్రమాదం పొంచి ఉందో అర్థం చేసుకోవచ్చు . సరిహద్దు గుండా చేర్చిన డ్రగ్స్‌ను స్థానిక పకడ్భంది నెట్ వర్క్ ప్రభావంతంగా పనిచేస్తోంది. సరిహద్దు దాటి వచ్చిన సరుకు వినియోగదారుడికి చేరాలంటే దేశంలో స్వీకరించే వ్యక్తులు, నిల్వ కేంద్రాలు, రవాణాదారులు, స్థానిక విక్రేతలు అంతర్జాతీయ మాఫియాను మించి రహస్య పద్దతుల్లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తారు.
* మందుల దుకాణాలే డ్రగ్స్ అమ్మకాల అడ్డాలు
రహస్యమైన ప్రదేశాలు అవసరం లేకుండానే డ్రగ్స్ మాఫియా బహిరంగ ప్రదేశాలను తమ అమ్మకాల కేంద్రాలుగా ఎంపిక చేఐసుకున్నది. సాధారణ మందుల అమ్మకాల కేంద్రాలు కొన్ని ప్రాణాంతక డ్రగ్స్ సరఫరా అడ్డాలుగా మారాయని పోలీసులు గుర్తించారు. మాన్సా ఘటన అనంతరం పంజాబ్ కెమిస్టుల సంఘం సభ్యులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మాదక, మానసిక ప్రభావం కలిగించే పదార్థాలున్న మందులను అర్హత కలిగిన వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించవద్దని ఆదేశాలు జారీ చేసింది . కొనుగోళ్లు, అమ్మకాలకు బిల్లులు ఉండాలని సూచించింది. అక్రమ విక్రయాలకు పాల్పడే వారికి అండగా నిలవబోమని ప్రకటించింది. రాష్ట్రంలో 27 వేలకుపైగా రిటైల్, హోల్‌సేల్ మందుల దుకాణాలు నమోదై ఉన్నట్లు సంఘం వెల్లడించింది.
* బిడ్డల కోసం తల్లుల పహారా ..!
మత్తు మరణాలపై పంజాబ్‌లో ప్రజా నిరసనలు కొత్తకాదు. 2018లో జూలై 1 నుంచి 7 వరకు ‘బ్లాక్ వీక్ ఎగైనెస్ట్ చిట్టా’ పేరుతో ఆందోళనలు జరిగాయి. సామాజిక మాధ్యమాల్లో మొదలైన పిలుపు వీధుల్లో ప్రదర్శనలుగా మారింది. మత్తు నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసనకారులు ప్రశ్నించారు. తర్వాత గ్రామస్థాయి సంఘటిత ప్రయత్నాలూ ముందుకొచ్చాయి. 2023లో బఠిండా జిల్లా దుల్లేవాలాలో 11 మంది మహిళలతో మత్తు వ్యతిరేక అవగాహన కమిటీ ఏర్పడింది. షిందర్పాల్ కౌర్ నాయకత్వంలో అనుమానిత రాకపోకలపై నిఘా, సమాచారం సేకరణ, చికిత్సకు సహాయం వంటి కార్యక్రమాలు చేపట్టారు. బిడ్డల భవిష్యత్తు కోసం మహిళలు నడుం కట్టిన ప్రత్యేక సందర్భం ఇదీ..
* కేంద్రం–రాష్ట్రం మధ్య మాటల యుద్ధం
జోటా హత్య ఇప్పుడు కేంద్రం, పంజాబ్ ప్రభుత్వం మధ్య రాజకీయ వివాదంగానూ మారింది. అక్టోబరు 16న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరతామని ప్రకటించారు. అదే రోజు కేంద్ర హోంశాఖ సంబంధిత వివరాలు కోరుతూ సమాచారాలు పంపింది. రాష్ట్రంలో నేరాలు, మత్తు సమస్యపై ఆయన విమర్శలు చేశారు. కాగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సరిహద్దు భద్రతలో కేంద్రం బాధ్యతను ప్రశ్నించారు. జోటా సేవలకు గుర్తింపుగా అమృత్‌సర్‌లోని సెంట్రల్ సిక్కు మ్యూజియంలో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేస్తామని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామీ ప్రకటించారు.

——————————————-

Please tell us what is wrong. Your report will be sent to the website team.

