Vaddiraju Ravichandra| ఆకేరు న్యూస్, తెలంగాణ: సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలంగాణ ఆడబిడ్డలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ప్రకృతిని ఆరాధించే పూల పండుగ
తెలంగాణకు ప్రత్యేకమైన బతుకమ్మ పండుగలో మహిళలు ప్రకృతిని, పూలను, గౌరమ్మను ఆరాధిస్తారని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఇష్టంగా, ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటారని తెలిపారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా తంగేడు, గునుగు, గుమ్మడి, బంతి, చామంతి తదితర రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, పిల్లాపాపలతో కలిసి ఆడిపాడుతూ సంబరాలు చేసుకుంటారని వివరించారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీక
అనాదిగా విశిష్టతను చాటుకుంటున్న బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతుందని రవిచంద్ర అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో సాగిన తెలంగాణ ఉద్యమ సమయంలో బతుకమ్మ పండుగ ప్రజలను ఐకమత్యంతో ముందుకు నడిపించిందని గుర్తుచేశారు.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు
కేసీఆర్ పాలనలో బతుకమ్మ పండుగకు అధికారిక గుర్తింపు కల్పించడంతో పాటు, దాని ప్రాచుర్యాన్ని మరింత పెంచారని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేకతను చాటిచెప్పే ఈ పండుగకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని తెలిపారు. ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ డిక్షనరీలోనూ ‘బతుకమ్మ’ పదానికి చోటు లభించిందని వివరించారు.
సద్దుల బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంలోని మహిళలతో పాటు దేశవిదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

