Riteish Deshmukh
* హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్
ఆకేరు న్యూస్, సినిమా: టాలీవుడ్ హీరో రామ్ పోతినేని నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రాప్-23’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.
రామ్ పోతినేని తొలిసారి దర్శకుడిగా బాధ్యతలు చేపడుతున్న ఈ చిత్రాన్ని రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. విభిన్నమైన పాత్రలతో బాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రితేశ్ దేశ్‌ముఖ్ ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారు.
ఏక్ విలన్, రైడ్ 2 వంటి చిత్రాలతో పాటు రాజా శివాజీ లోనూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రితేశ్.. కథతో పాటు తన పాత్ర నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌కు అంగీకరించినట్లు చిత్ర బృందం వెల్లడించింది.
షూటింగ్ లొకేషన్ వీడియో విడుదల
హైదరాబాద్‌లో జరుగుతున్న తాజా షూటింగ్ షెడ్యూల్లో రితేశ్ దేశ్‌ముఖ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం షూటింగ్ లొకేషన్‌కు సంబంధించిన బీటీఎస్ వీడియోను విడుదల చేసింది. ఇందులో సినిమా కోసం రూపొందించిన భారీ సెట్‌తో పాటు రితేశ్ సెట్లోకి అడుగుపెట్టిన దృశ్యాలు కనిపించాయి. హీరో, దర్శకుడు రామ్ పోతినేని ఆయనకు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. ఈ వీడియో సినిమా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ప్రముఖ సాంకేతిక నిపుణులు
ఈ చిత్రంలో సంయుక్త కథానాయికగా నటిస్తున్నారు. మరికొందరు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జాతీయ అవార్డు గ్రహీత తిరునవుక్కరసు (తిరు) సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
యాక్షన్ సన్నివేశాలను పీటర్ హెయిన్, విక్రమ్ మోర్, కెవిన్ రూపొందిస్తున్నారు. హీరోగా ప్రేక్షకులను అలరించిన రామ్.. దర్శకుడిగా ఎలాంటి కథను తెరపై ఆవిష్కరిస్తారోనన్న ఆసక్తి నెలకొంది. రితేశ్ దేశ్‌ముఖ్ తెలుగు తెరపై తొలిసారి కనిపించనుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

