ఉన్నత స్థాయి సమీక్ష లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
* మహారాష్ట్రతో త్వరలో చర్చలు
* 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణంపై దృష్టి
Revanth Reddy| ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో జరగనున్న చర్చలకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. మరోవైపు డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాలకు అదనపు నీటిని సమకూర్చే అంశంపైనా ప్రత్యేక దృష్టి సారించారు.
మహారాష్ట్రతో చర్చలకు సిద్ధం
తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో త్వరలో చర్చలు జరిగే అవకాశం ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావుతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి నీటి లభ్యత, ముంపు విస్తీర్ణం, నిర్మాణ ఎత్తు తదితర అంశాలపై అధికారులు వివరించారు. తెలంగాణకు సాధ్యమైనంత ఎక్కువ నీటిని అందుబాటులోకి తీసుకొచ్చేలా సాంకేతిక నివేదికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
152 మీటర్ల ఎత్తుపై దృష్టి
తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మిస్తే సుమారు 2,300 ఎకరాల భూములు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. 150 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే ముంపు విస్తీర్ణం వెయ్యి ఎకరాల్లోపే ఉంటుందని వివరించారు. గతంలో 148 మీటర్ల ఎత్తుకు మాత్రమే మహారాష్ట్ర అంగీకరించిన నేపథ్యంలో, ఆ ఎత్తుతో ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయా అనే అంశాన్ని కూడా పరిశీలించారు.
ముంపు ప్రభావాన్ని కచ్చితంగా అంచనా వేసి, నీటి వినియోగానికి అనుకూలమైన డిజైన్లు రూపొందించాలని సీఎం ఆదేశించారు. 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించేలా పూర్తి సమాచారంతో చర్చలకు వెళ్లాలని సూచించారు.
ఆదిలాబాద్‌కు సాగునీటి భరోసా
అటవీ, గిరిజన ప్రాంతాలతో కూడిన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సాగునీటి సదుపాయాలను మెరుగుపరచడమే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 2 లక్షల ఎకరాలకు నీరు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.
బ్యారేజీ ఎత్తుపై స్పష్టత వచ్చిన వెంటనే తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని తరలించే మార్గాల రూపకల్పన, భూసేకరణకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర జల సంఘం సమావేశాల్లో చర్చించిన అంశాలు, సమర్పించాల్సిన నివేదికలను కూడా సిద్ధం చేయాలని సూచించారు.
డిండి, అచ్చంపేటకు అదనపు నీరు
డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాలకు అవసరమైన నీటి కేటాయింపులపైనా సమీక్షలో చర్చించారు. ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ప్రాజెక్టుకు 0.5 టీఎంసీలు, అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి 0.1 టీఎంసీ చొప్పున మొత్తం 0.6 టీఎంసీల నీటిని అదనంగా సమకూర్చుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు.
శ్రీశైలం, నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు నీటిని తరలించే మార్గాలను పరిశీలించాలని సూచించారు. అవసరమైన పంప్‌హౌస్‌ల ఏర్పాటు, కాల్వలు, సొరంగాల సామర్థ్యంపై అధ్యయనం చేసి తగిన డిజైన్లు రూపొందించాలని నీటిపారుదల శాఖ అధికారులకు స్పష్టం చేశారు.
పాలమూరు నీటికి కోత ఉండకూడదు
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించిన నీటికి ఎలాంటి ఆటంకం కలగకుండా డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాలకు అదనపు నీటిని అందించేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నార్లాపూర్ నుంచి నీటిని తరలించాలా? ఏదుల నుంచి తీసుకోవాలా? అనే అంశంపై అధికారులు వివరించిన అంచనా వ్యయాలు, సాంకేతిక అనుకూలతలను పరిశీలించారు.
పాలమూరు ప్రాజెక్టు ప్రయోజనాలకు భంగం కలగకుండా కొత్త ప్రాజెక్టులకు నీటిని సమకూర్చే మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఈ ప్రతిపాదనలకు సమావేశంలో పాల్గొన్న మంత్రులు మద్దతు తెలిపారు.
తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చలు, ఆదిలాబాద్‌కు సాగునీటి విస్తరణ, డిండి–అచ్చంపేట ప్రాజెక్టులకు అదనపు నీటి సమీకరణ వంటి అంశాలపై ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలు కీలకంగా మారనున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

