సమావేశంలో మాట్లాడుతున్న పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేశ్
* సైబరాబాద్ సీపీ రమేశ్
Cyberabad Police| ఆకేరు న్యూస్, హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, చట్టపరమైన గడువుల్లోగా పూర్తి చేయాలని పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేశ్ అధికారులను ఆదేశించారు. సీసీటీఎన్ఎస్ అప్డేట్లు, నూతన క్రిమినల్ చట్టాల అమలుపై శుక్రవారం డీసీపీలు, ఏసీపీలు, పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో (ఎస్‌హెచ్‌వో) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నేర పరిశోధనలో ఎలక్ట్రానిక్ ఆధారాల సేకరణ, నమోదు, భద్రత కోసం ‘ఈ-సాక్ష్య’ యాప్‌ను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. డిజిటల్ ఆధారాల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సీసీటీఎన్ఎస్ పోర్టల్‌లో ఎఫ్ఐఆర్ వివరాలు, కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు.
గడువుల్లోగా దర్యాప్తు
కేసుల స్వభావాన్ని బట్టి వర్తించే 60, 90 రోజుల చట్టబద్ధమైన గడువులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సీపీ ఆదేశించారు. దర్యాప్తు అధికారులు సకాలంలో అవసరమైన చర్యలు చేపట్టి, బాధితులకు త్వరగా న్యాయం అందేలా చూడాలన్నారు. జీరో ఎఫ్ఐఆర్ల నమోదు, సంబంధిత పోలీస్ స్టేషన్‌కు బదిలీ ప్రక్రియ, తదుపరి విచారణలను చట్ట నిబంధనల ప్రకారం నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. బాధితులకు న్యాయం చేసే విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని స్పష్టం చేశారు.
రోజువారీ సమీక్షలు
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్‌హెచ్‌వోలు, ఏసీపీలు కేసుల దర్యాప్తు పురోగతిని, ఈ-సాక్ష్య యాప్ వినియోగాన్ని రోజువారీగా సమీక్షించాలని సీపీ ఆదేశించారు. దర్యాప్తులో జాప్యానికి గల కారణాలను గుర్తించి, పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు రోజువారీ నివేదికలు సమర్పించాలని తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

