Cyclone Warning AP CM Chandrababu Review
* అధికారుల అత్యవసర సమావేశం
* ప్రజలకు కీలక సూచనలు
ఆకేరు న్యూస్, అమరావతి : అర్నబ్ తుపాన్పై ఆంధ్రప్రదేశ్ యంత్రాంగం సర్వత్రా అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు , ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్, హోం మంత్రి అనిత కూడా నిరంతరం సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నానికి 215 కిలోమీటర్ల దూరంలో తుపాన్ కేంద్రీకృతమై ఉంది. రేపు ఉదయం యానం వద్ద తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయని, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల సమావేశంలో అధికారులు అత్యవసరంగా సమావేశం అయ్యారు. తుపాను పరిస్థితి, ప్రభావిత ప్రాంతాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ప్రజలకు ఆర్టీజీఎస్, ఏపీఎస్డీఎంఏ అధికారుల కీలక సూచనలు జారీ చేశారు.
* పెనుగాలులు వీచే సూచనలు..
తుపాన్ సమయంలో పెనుగాలులు వీచే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. ఆ సమయంలో ప్రజలెవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అధికారులు కోరితే వారు చెప్పినట్లు మీకు దగ్గర్లోని తుపాన్ షెల్టర్లలోకి వెళ్లాలని తెలిపారు. తుపాన్ సమయంలో సముద్రం చెంతకు వెళ్ల రాదన్నారు. నదుల, కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు.
తీరం వెంబడి సముద్రపు అలలు 1 నుంచి 2 మీట్ల ఎత్తు వరకు ఎగసి పడే అవకాశం ఉందని, అటువైపు ఎవరూ వెళ్లొద్దని పేర్కొన్నారు. 14 జిల్లాలకు 12 ఎన్డీఆర్ ఎఫ్, 10ఎస్డీఆర్ ఎఫ్ దళాలను సహాయ చర్యల కోసం తరలిచామని, 20 జిల్లాల్లో 2,131 తుపాన్ షెల్టర్ ప్రాంతాల ఏర్పాటు చేశామని వివరించారు. 18 జిల్లాల్లో 2.70 కోట్ల మంది మొబైల్ ఫోన్లకు నిరంతరం తుపాన్ హెచ్చరికలు జారీ చేశామన్నారు.
* పుకార్లు నమ్మొద్దు..
వదంతులు, పుకార్లను నమ్మొద్దని ఆర్టీజీఎస్, ఏపీఎస్డీఎంఏ అధికారులు తెలిపారు. కేవలం అధికారుల నుంచి వచ్చే హెచ్చరికలు సూచనలు మాత్రమే పాటించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ), ఆర్టీజీఎస్ ఇచ్చే హెచ్చరికలనే అనుసరించాలని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అనధికారిక సమాచారాన్ని నమ్మవద్దని కోరారు.
* 1,351 మంది గర్భిణిల ఆస్పత్రులకు తరలింపు
తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు 1,087 వైద్య బృందాల ఏర్పాటు చేశారు. 8,281 అత్యవసర పడకలు, 1,274 అంబులెన్సులు సిద్ధం చేశారు. పాముకాటు బారి నుంచి రక్షించేలా ఆసుపత్రుల్లో 21,536 యాంటీ స్నేక్ వీనమ్లు ఉంచారు. 1,351 మంది గర్భిణిలను ఇప్పటికే ఆసుపత్రులకు తరలించారు. 2,613 మంచినీళ్ల ట్యాంకర్లు, 2,430 జనరేటర్లు, 4,448 ఆర్వో ప్లాంట్లు సిద్ధం చేశారు. 14,686 రేషన్ దుకాణాల్లో రెండు నెలలకు సరిపడా నిత్యావసరాల నిల్వలు ముందస్తుగానే నిల్వ చేసినట్లు వెల్లడించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

